Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియోలో ఉన్నది పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదు

0

22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ). ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడఇక్కడ). ఈ దాడిలో మృతి చెందిన వారిలో భారత నావికాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు, ఆయన అంత్యక్రియలు 23 ఏప్రిల్ 2025న ఆయన స్వస్థలం హర్యానాలోని కర్నాల్‌లో జరిగాయి. ఈ నేపథ్యంలో, “పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి వీడియో” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, ఓ జంట పచ్చిక మైదానంలో హిందీ పాటకు నృత్యం చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇదే వీడియోను పలు మీడియా సంస్థలు కూడా లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చివరి వీడియో అని రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడానికి ముందు తీసిన చివరి వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది. అలాగే ఈ తప్పుడు ప్రచారంపై కూడా ఆయన కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఈ వైరల్ వీడియోలో ఉన్నది తామేనని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగర్ యాషికా శర్మ షెరావత్, ఆమె భర్త ఆశిష్ షెరావత్ ఓ వీడియోలో స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ‘kashmir_weather’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 24 ఏప్రిల్ 2025న షేర్ చేయబడిన ఒక వీడియో (ఆర్కైవ్డ్ లింక్) లభించింది . ఈ వీడియోలో ఓ జంట వైరల్ వీడియోలో ఉన్నది వారిద్దరే అని, మేము సజీవంగా, సురక్షితంగా ఉన్నారని చెప్పడం మనం చూడవచ్చు. తమకు సంబంధించిన వీడియోను లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ జంటకు సంబంధించిన చివరి వీడియో అంటూ పలు మీడియా సంస్థలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆ జంట పేర్కొంది.

తదుపరి ఈ జంటకు సంబంధించిన వివరాల కోసం పైవీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోలో ఉన్నది యాషికా శర్మ షెరావత్, ఆశిష్ షెరావత్ అనే జంట అని తెలిసింది. యాషికా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఆమె ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, బ్లాగర్ అని పేర్కొంది. 

ఈ జంట వీడియో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ జంటకు సంబంధించిన చివరి వీడియో అంటూ వైరల్ అవుతున్నందున, దాని మీద స్పందిస్తూ 24 ఏప్రిల్ 2025న ఈ జంట వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒక వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని మహిళ మాట్లాడుతూ “మేము బతికే ఉన్నాము. వీడియోలో ఉన్న వ్యక్తి వినయ్ నర్వాల్ అని, నేను ఆయన భార్య హిమాన్షి అని మీడియా సంస్థలు మా వీడియోలను ఎందుకు వ్యాప్తి చేస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. వారికి ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందో, భారతదేశంలో ప్రెస్ ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. ఈ ఉదయం నుండి మేము చాలా భయపడుతూ ఉన్నామని, మాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయని తెలిపింది. మా మృతికి సంతాపం చెబుతున్నారు, మేము బతికే ఉన్నామనే విషయం తెలుసుకోండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పండని” అని చెప్పుకొచ్చింది.

యాషిక, ఆశిష్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ వీడియో ప్రస్తుతం తొలగించబడినట్లు మేము గుర్తించాము. అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్న అదే ప్రదేశంలో ఆమె డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో మాకు కనిపించింది. ఆమె ఈ వీడియోను19 ఏప్రిల్ 2025న పోస్ట్ చేసింది.

పహల్గామ్‌లో ఉగ్రదాడిలో మరణించిన భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య హిమాన్షి సోవామి దాడికి కొద్ది నిమిషాల ముందు ఆనందంగా నృత్యం చేస్తున్న వీడియో అంటూ వేరే జంటకు సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు అంటూ పలు మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

‘దైనిక్ భాస్కర్’ వార్త కథనం ప్రకారం, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమరుడైన హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య హిమాన్షిల చివరి వీడియోగా చెప్పబడుతున్న వీడియో వారిది కాదని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది. అలాగే ఈ తప్పుడు ప్రచారంపై కూడా ఆయన కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది.

చివరగా, ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll