Fake News, Telugu
 

2018లో ఎన్నికల ప్రచారంలో ఒక మహిళ మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నించిన వీడియోను ప్రస్తుత 2023 ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను అక్కడి మహిళ నిలదీసింది అంటూ ఒక  వీడియో  సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రముఖ వార్తా సంస్థలు కూడా ఈ వీడియోను ఇప్పుడు ప్రసారం చేయడంతో ఈ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2023 ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను అక్కడి మహిళ నిలదీసిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2018 ఎన్నికల సమయంలో జరిగింది. కాలనీలో సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారని ఒక మహిళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నించినట్టు అప్పట్లో వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ప్రస్తుతం 2023లో జరుగుతున్న ఎన్నికలకు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నట్టు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను అక్కడి మహిళ నిలదీసిన విషయం నిజమే అయినప్పటికీ, ఈ ఘటన 2018 ఎన్నికల సమయంలో జరిగింది.

ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, నవంబర్ 2018లో ఈ వీడియోను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. తమ కాలనీలో సమస్యలను పరిష్కరించకుండా వోట్లు అడగడానికి ఎందుకు వచ్చారంటూ ఒక మహిళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను నిలదీసింది అంటూ ఈ వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

2018లో ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి ఈ వీడియో ఇప్పటిది కాదని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, 2018లో ఎన్నికల ప్రచారంలో ఒక మహిళ మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నించిన వీడియోను ప్రస్థుత 2023 ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll