Fake News, Telugu
 

చౌదరి రహమత్ అలీ 1947లో రూపొందించిన ఊహజనిత పాకిస్తాన్ మ్యాప్‌ను 1857లో రూపొందించిందంటూ షేర్ చేస్తున్నారు

0

1857 నాటికే తయారు చేసిన పాకిస్తాన్ మ్యాప్ అంటూ ఒక ఫోటోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ మ్యాప్‌లో హైదరాబాద్, బెంగాల్, అస్సాం మొదలైన ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా స్వతంత్రం రాకముందు నుండే దేశ విభజనను ప్లాన్ చేసారని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1857 నాటికే తయారు చేసిన పాకిస్తాన్ మ్యాప్.

ఫాక్ట్(నిజం): చౌదరి రహమత్ అలీ 1947లో పాకిస్తాన్ చరిత్రను వివరిస్తూ రాసిన ‘Pakistan: The Fatherland of the Pak Nation’ అనే పుస్తకంలో ఈ ఊహాజనిత మ్యాప్‌ను మొదటిసారి ప్రచురించారు. అప్పట్లో ఈ మ్యాప్‌కు ఎటువంటి గుర్తింపు లేదు. అంతకు ముందు పాకిస్తాన్ మ్యాప్ అందుబాటులో ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హైదరాబాద్, బెంగాల్,  బలూచిస్తాన్ మొదలైన ముస్లిం ఆధిపత్య ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా చూపిస్తున్న ఈ మ్యాప్ 1857లో రూపొందించింది కాదు. ఈ మ్యాప్‌ను చౌదరి రహమత్ అలీ అనే పాకిస్తాన్ జాతీయవాది 1947లో రూపొందించాడు. పైగా ఇది రహమత్ అలీ తన ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ఒక ఊహాజనితమైన మ్యాప్ మాత్రమే తప్ప, అప్పట్లో ఈ మ్యాప్‌కు ఎటువంటి గుర్తింపు లేదు.

చౌదరి రహమత్ అలీ :

స్వాతంత్రోద్యమం సమయంలో ముస్లింలకు ప్రత్యేక ఇస్లామిక్ రాజ్యం ఉండాలని ప్రతిపాదించిన వారిలో చౌదరి రహమత్ అలీ మొదటి వాడు. అసలు పాకిస్తాన్ అనే పదాన్ని/పేరును ప్రతిపాదించిందే చౌదరి రహమత్ అలీ. 28 జనవరి 1933 నాడు ‘Now or Never: Are we to live or perish forever’ పేరుతో రహమత్ అలీ ఒక కరపత్రాన్ని విడుదల చేసాడు. ముస్లింలు అధికంగా ఉండే పంజాబ్, కాశ్మీర్, బలూచిస్తాన్, సింద్ మరియు ఆఫ్ఘన్ ప్రావిన్స్ కలిపి ఒక ప్రత్యేక ఇస్లామిక్ రాజ్యం చేయాలనీ ఈ కరపత్రంలో ప్రతిపాదించాడు. ఈ రాజ్యానికి పాకిస్తాన్ అని పేరు ప్రతిపాదించాడు. అలా పాకిస్తాన్ అన్న పేరు మొదటిసారి ప్రచారంలోకి వచ్చింది.

పాకిస్తాన్ అనే ఆలోచనకి ఇదే మూలం అని చరిత్రకారుల అభిప్రాయం. కాకపోతే అప్పట్లో ఈ ప్రతిపాదనకు పెద్దగా ఆదరణ లభించలేదు. 1930 దశకం చివర్లో జిన్నా కాంగ్రెస్‌తో విడిపోయిన అనంతరం ముస్లింలకు ప్రత్యేక దేశం అనే ప్రతిపాదన ఊపందుకుంది. 1940లో లాహోర్‌లో జరిగిన ముస్లిం లీగ్ సెషన్‌లో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని అధికారికంగా తీర్మానం చేసారు. చివరిగా 1947లో పాకిస్తాన్ ఏర్పడింది.

పాకిస్తాన్ మ్యాప్ :

ముస్లింలకు పాకిస్తాన్ అనే ప్రత్యేక రాజ్యం అనే ఆలోచనను వ్యాప్తి చేసే క్రమంలో పాకిస్తాన్ చరిత్రపై చౌదరి రహమత్ అలీ పలు పుస్తకాలను రాసాడు. ఇదే క్రమంలో 1947లో ‘Pakistan: The Fatherland of the Pak Nation’ అనే పేరుతో పాకిస్తాన్ చరిత్రను వివరిస్తూ చౌదరి రహమత్ అలీ ఒక పుస్తకాన్ని విడుదల చేసాడు. పాకిస్తాన్ చరిత్రకు సంబంధించి అలీ రాసిన పుస్తకాలలో ఇది మూడో ఎడిషన్. అంతకు ముందు రెండు ఎడిషన్లను 1946లో విడుదల చేసాడు.

ఐతే రహమత్ అలీ రాసిన మూడో ఎడిషన్‌లో పాకిస్తాన్ చరిత్రను తెలుపుతూ శతాబ్దం నుండి పాకిస్తాన్‌కు సంబంధించిన మ్యాప్స్ ప్రచురించాడు. ఈ మ్యాప్స్‌లో ఇప్పుడు వైరల్ అవుతున్న మ్యాప్ కూడా ఒకటి. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా ఈ మ్యాప్‌లో చూపించారు. రహమత్ అలీ రూపొందించిన మరికొన్ని మాప్స్ ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న మ్యాప్‌కు 1947లో రహమత్ అలీ రూపొందించిన ఈ మ్యాపే సోర్స్‌గా పరిగణించవచ్చు. అంతకు ముందు పాకిస్తాన్ మాప్స్ అందుబాటులో ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి స్వాతంత్రానికి వందేళ్ళ ముందే ప్రత్యేక పాకిస్తాన్ ఆలోచన చేసారని పోస్టులో చేస్తున్న వాదన తప్పని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, చౌదరి రహమత్ అలీ 1947లో రూపొందించిన ఊహజనిత పాకిస్తాన్ మ్యాప్‌ను 1857లో రూపొందించిందంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll