Fake News, Telugu
 

సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఓ మిర్చి రైతు ఆవేదనతో మాట్లాడుతున్న ఈ వైరల్ వీడియో 2017 నాటిది

0

ఇటీవల, జనవరి 2025 నుండి మిర్చి ధరలు పడిపోయాయి, దీనితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు మిర్చి మార్కెట్లలో మిర్చి  రైతులు నిరసనలకు దిగారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “ఎన్నికల ముందు అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు తెలంగాణలోని ప్రభుత్వం కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని గుండెలు బాదుకుంటున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం నావరం గ్రామానికి చెందిన మిర్చి రైతు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో మిర్చి ధరలు భారీగా పడిపోయాయని చెబుతూ, ఓ రైతు మిర్చి బస్తాల మధ్య బాధతో ఏడుస్తూ మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2025లో మిర్చి ధరలు బాగ పడిపోవడంతో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఓ రైతు బాధతో ఏడుస్తూ మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు, ఈ వీడియో ఏప్రిల్ 2017 నాటిది. 2017లో మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామరం గ్రామానికి చెందిన చింతిర్యాల కోటేశ్వరరావు అనే మిర్చి రైతు ఆవేదనతో మాట్లాడిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ప్రస్తుతం 2025లో కూడా మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కొన్ని పోస్ట్‌లు అధిక నిడివి గల వైరల్ వీడియోను కలిగి ఉన్నాయి. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులో మరో రైతు కేసీఆర్ ప్రభుత్వం అని మాట్లాడాం మనం చూడవచ్చు. దీని బట్టి ఈ వీడియో ఇటీవలిది కాకపోయి ఉండవచ్చు అని తెలుస్తుంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించలేదు. తదుపరి ఈ వీడియోకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో వెతకగా, ఇదే వీడియోను (ఆర్కైవ్డ్) 10 మే 2019న ‘vsr breaking news’ అనే యూట్యూబ్‌ ఛానల్, అలాగే 30 ఏప్రిల్ 2017న ‘Indhu Games’ అనే యూట్యూబ్‌ ఛానల్ షేర్ (ఆర్కైవ్డ్) చేసినట్లు గుర్తించాము. దీని ఆధారంగా ఈ వీడియో ఇటీవలిది కాదని, కనీసం ఏప్రిల్ 2017 నుండి ఆన్‌లైన్‌లో ఉందని మనం నిర్థారించవచ్చు.

అలాగే ఈ క్రమంలోనే, ఈ వైరల్ వీడియో ఇటీవలది కాదని చెబుతూ తెలంగాణకు చెందిన మీడియా సంస్థ ‘V6 news’ తమ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో 10 ఫిబ్రవరి 2025న షేర్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోలో ‘V6 news’ ప్రతినిధి వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామరం గ్రామానికి చెందిన చింతిర్యాల కోటేశ్వరరావుతో ఈ వైరల్ వీడియో గురించి మాట్లాడం మనం చూడవచ్చు.

ఈ వీడియోలో కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ వీడియో 2017/2018 నాటిది అని పేర్కొన్నారు. అలాగే, అప్పుడు జరిగిన సంఘటనలను వివరిస్తూ, ఖమ్మం మిర్చి మార్కెట్ కార్యాలయాన్ని రైతులు దాడి చేసి ధ్వంసం చేశారని కోటేశ్వరరావు చెప్పడం మనం చూడవచ్చు. ఏప్రిల్ 2017లో మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో, మిర్చికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ను చేస్తూ మిర్చి  రైతులు 28 ఏప్రిల్ 2017న ఖమ్మం మిర్చి మార్కెట్ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ ఏప్రిల్ 2018లో పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2017 నాటిది అని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, 2017లో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఓ మిర్చి రైతు ఆవేదనతో ఏడుస్తూ మాట్లాడిన వీడియోను ప్రస్తుతం 2025లో మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll