Fake News, Telugu
 

పాకిస్తాన్ రోడ్లపై రద్దయిన భారత ₹500 నోట్లు దొరికాయని లక్నోకి చెందిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

2016లో భారత్‌లో రద్దు చేయబడిన ₹500 నోట్లు పాకిస్తాన్‌ రోడ్లపై పెద్ద సంఖ్యలో దొరుకుతున్నాయని ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఇద్దరు పిల్లల వద్ద ₹500 నోట్ల కట్టలు ఉండడం చూడవచ్చు. మోదీ ప్రభుత్యం ఈ నోట్లు రద్దు చేయడంతో నిరుపయోగంగా మారిన పాత ₹500 నోట్లు ఇప్పుడు పాకిస్తాన్ రోడ్లపై పడి ఉన్నాయని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పాకిస్తాన్‌లో ఇద్దరి పిల్లలకు రద్దు చేయబడిన భారతదేశపు ₹500 నోట్లను దొరికినప్పటి దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి చెందినది. లక్నోలోని ఆషియానా జంక్షన్ వద్ద ఇద్దరు బాల పారిశుద్ధ్య కార్మికుల వద్ద పాత ₹500 నోట్లను బ్రిజేష్ మిశ్రా అనే ఉత్తర ప్రదేశ్ వ్యక్తి గుర్తించి వీడియో చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.  

ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీన్ని ముందుగా ‘akhimishra511’ అనే భారత్‌కు చెందిన ఇస్టాగ్రామ్ పేజిలో 27 డిసెంబర్ 2024న అప్లోడ్ (ఆర్కైవ్) చేసినట్లు గుర్తించాం. కానీ ఈ వీడియో గురించిన ఎటువంటి వివరాలు ఇవ్వకపోవడంతో, ఈ ఘటన పాకిస్తాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో జరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొన్నారు.

అయితే వీడియో వైరల్ అవడంతో ఈ సంఘటనని రికార్డ్ చేసిన బ్రిజేష్ మిశ్రా అనే ఉత్తర్ ప్రదేశ్ కంటెంట్ క్రియేటర్ ఈ ఘటన గురించిన మరిన్ని వివరాలను తన సోషల్ మీడియా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ద్వారా వెల్లడించారు. అతను చెప్పిన వివరాల ప్రకారం, లక్నోలోని ఆషియానా జంక్షన్ వద్ద కొన్ని రోజుల ముందు రిక్షాపై వెళ్తున్న ఇద్దరు బాల పారిశుధ్య కార్మికుల వద్ద పాత ₹500 నోట్ల కట్టలు కనిపించగా, వాటిని వీడియో తీసి తన మేనల్లుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మరియు తన అకౌంట్లో పోస్టు చేశారు. అయితే వైరల్ పోస్టుల్లో చెప్పినట్లుగా ఈ వీడియో పాకిస్తాన్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినది కాదని, ఇది ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందినదని, వీడియోలోని పిల్లలు అస్సాం నుంచి లక్నోకు వలస వచ్చిన వారని, వాళ్ల తల్లిదండ్రుల చెప్పిన వివరాలు బ్రిజేష్ మిశ్రా తెలిపారు.

అలాగే వైరల్ వీడియోలోని పిల్లలను మళ్లీ కలిసి బ్రిజేష్ మిశ్రా వాళ్లతో మాట్లాడుతున్న వీడియోలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. చెత్తకుప్పలో దొరికిన ఆ నోట్లను ఆషియానా జంక్షన్ వద్ద వేరే బాలుడు లాక్కున్నాడని వారు పేర్కొన్నారు. అయితే ఈ నోట్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మేము బ్రిజేష్ మిశ్రాను సంప్రదించాం. అతను స్పందించాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

అయితే వైరల్ వీడియోని పరిశీలించగా, వీడియోలోని దృశ్యాలను లక్నోలోని ఆషియానా జంక్షన్ యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూ మరియు ఇతర వీడియోలతో పోల్చగా, వైరల్ వీడియో లక్నోలో తీసినట్లుగా స్పష్టమవుతుంది. ఆషియానా జంక్షన్లో ఉన్న చాయ్ పత్తి దుకాణాన్ని మరియు హనుమాన్ మందిరాన్ని వైరల్ వీడియోలో కూడా చూడవచ్చు.

చివరిగా, లక్నోకు చెందిన వీడియోని పాకిస్తాన్ రోడ్లపై భారత్ యొక్క పాత ₹500 నోట్లు దొరికాయంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll