“అమెరికా కిక్ బాక్సింగ్‌లో కప్పు గెలిచాక అమెరికా తెల్లజాతీయుల వివక్ష అహంకారానికి బుద్ధి చెబుతూ ఆ కప్పును కాలిగోటితో సమానంగా నదిలో విసిరేసి తన ఆత్మ అభిమానాన్ని చాటుకున్న రిచర్డ్ రైట్ అనే నల్ల జాతీయుడు” అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అమెరికాలో కిక్ బాక్సింగ్ ఈవెంట్ గెలిచిన తర్వాత ఒక నల్లజాతి వ్యక్తి శ్వేతజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా కప్పును తన్నుతున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో బంగ్లాదేశ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతలకు మెడల్స్ మరియు బహుమతులు అందజేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. వీడియోలో బహుమతి అందుకొని స్టేజీ కిందకు వచ్చి దాన్ని కాలితో తన్నివేసిన బాడీ బిల్డర్ పేరు జాహిద్ హాసన్ షువో. మీడియాకి తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో అవార్డుల ఎన్నికలో అవినీతి జరిగిందని షువో ఆరోపించారు. తన ఈ ప్రవర్తనకు శిక్షగా బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ (BABBF) వారు తనని జీవితకాలం పాటు బ్యాన్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన ఉన్న వీడియోను ‘బాడీ బిల్డింగ్ ఇన్సైడర్ (Bodybuilding Insider)’ అనే యూట్యూబ్ ఛానెల్ 26 డిసెంబర్ 2022 షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగిందని తెలుస్తుంది.
దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).
ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన బంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ (BABBF) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 పోటీల అవార్డు బహుకరణ అప్పుడు జరిగింది. పోటీల్లో రెండవ బహుమతి వచ్చిన జాహిద్ హాసన్ షువో అనే బంగ్లాదేశీ బాడీ బిల్డర్ స్టేజీ పైనుండి కిందకి దిగి వచ్చి తన బహుమతిని కాలితో తన్నాడు. దీనికి ముందు స్టేజిపై ఉన్నప్పుడు తాను బహుమతులు ఇస్తున్న వారితో ఎదో మాట్లాడి తర్వాత తనని పక్కకి నిల్చోమని ఒకరు చెపుతున్న దృశ్యాలు మనకి వైరల్ వీడియోలో కనిపిస్తాయి. షువో మీడియాతో మాట్లాడుతూ, నిర్వాహకులపై తన నిరసనను వ్యక్తం చేయడానికి తాను అలా చేశానని చెప్పారు (ఇక్కడ మరియు ఇక్కడ). జాహిద్ హాసన్ షువో ప్రవర్తనకు శిక్షగా బాంగ్లాదేశ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ షువోపై జీవితకాల నిషేధాన్ని విధించింది. వారు విడుదల చేసిన సర్కులర్ ఇక్కడ చూడవచ్చు.
చివరగా, అమెరికాలో కిక్ బాక్సింగ్ ఈవెంట్ గెలిచిన తర్వాత ఒక నల్లజాతి వ్యక్తి శ్వేతజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా కప్పును తన్నాడని చెబుతూ బంగ్లాదేశ్‌కు చెందిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.