ముందు తాను తాగి ఎంగిలి చేసిన జ్యూస్ గ్లాస్‌ను కస్టమర్‌కు ఇవ్వడంతో ఆగ్రహించిన ఒకతను ఆ జ్యూస్ షాప్ యజమానిపై దాడికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తులు అరబిక్ మాట్లాడుతుండడం మరియు వీడియోపై అరబిక్‌లో కాప్షన్స్ ఉండడంతో ఆ యజమాని ముస్లిం అంటూ మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం దుకాణదారుడు తాను ఎంగిలి చేసిన జ్యూస్‌ను కస్టమర్‌కు అందిస్తున్న వీడియో
ఫాక్ట్(నిజం): ఇది ఒక ప్రాంక్ వీడియో, ఈ వీడియో పూర్తి ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఎంగిలి చేసిన జ్యూస్ ఇచ్చినందుకు కస్టమర్ యజమానిపై దాడి చేసిన అనంతరం ఆ యజమాని ఇది ప్రాంక్ ఆని వ్యాన్ లోపల కెమెరాలు ఉన్నాయని ఆ కస్టమర్‌కు చూపిస్తాడు. ఆ తరవాత వాళ్ళిద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకుంటారు. దీన్నిబట్టి ఒక ప్రాంక్ వీడియోను మతపరమైన కోణంలో తప్పుగా షేర్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ జ్యూస్ షాప్ యజమాని తాను ఎంగిలి చేసిన జ్యూస్‌ను కస్టమర్‌కు అందిస్తాడు. ఐతే ఇది నిజంగా జరిగిన ఘటన కాదు. ఒక ప్రాంక్‌లో భాగంగా ఆ జ్యూస్ షాప్ ఓనర్ ఇలా చేస్తాడు.
వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను షేర్ చేసిన అనేక సోషల్ మీడియా పోస్టులు మరియు యూట్యూబ్ వీడియోలు మాకు కనిపించాయి. ఈ క్రమంలోనే కొన్ని సోషల్ మీడియా పోస్టులో ఈ వీడియో యొక్క ఎక్కువ 1:40 నిమిషాల నిడివిగల ఫుటేజ్‌ను షేర్ చేసాయి.
ఈ ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఇది ఒక ప్రాంక్ వీడియో అని అర్ధమవుతుంది. ఎంగిలి చేసిన జ్యూస్ ఇచ్చినందుకు కస్టమర్ యజమానిపై దాడి చేసిన అనంతరం ఆ యజమాని ఇది ప్రాంక్ ఆని వ్యాన్ లోపల కెమెరాలు ఉన్నాయని ఆ కస్టమర్‌కు చూపిస్తాడు. ఆ తరవాత వాళ్ళిద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకుంటారు. దీన్నిబట్టి వీడియోలో చూపిస్తున్నది నిజం కాదని స్పష్టమవుతుంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై కూడా అరబిక్‌లో ప్రాంక్ ఇన్ ఇస్లామిక్ యూనివర్సిటీ అని స్పష్టంగా రాసి ఉంది. కాబట్టి ఒక ప్రాంక్ వీడియోను మతపరమైన కోణంలో తప్పుగా షేర్ చేస్తున్నారని స్పష్టమవుతుంది.
చివరగా, ఎంగిలి చేసిన జ్యూస్ కస్టమర్లకు ఇస్తున్నట్టు ఉండే ఒక ప్రాంక్ వీడియోను మతపరమైన ఆరోపణలతో తప్పుగా షేర్ చేస్తున్నారు.