‘మా అబ్దుల్ అలాంటివాడు కాదు అంటారు చెప్తే.. తర్వాత ఇలా అవుతుంది’ అంటూ, ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు, తమ మొహాలపై గాయాలతో కనిపిస్తున్న రెండు ఫోటోలు ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకున్న ఈ హిందూ అమ్మాయిలు ఇలా తన్నుల పాలయ్యారని అర్థం వచ్చేలాగా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు యూజర్లు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు, వాళ్లు కొట్టడంతో గాయాలపాలై కనిపిస్తున్న ఫోటోలు ఇవి.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్న మొదటి మహిళ, ఒక బంగ్లాదేశీ ముస్లిం, తనకు రోడ్డు ప్రమాదంలో ఈ గాయాలు అయ్యాయి. రెండో ఫోటోలో ఉన్న మహిళ భారత్‌కు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్, ఆమె స్నాప్‌చాట్‌లో లెన్స్(ఫిల్టర్) వాడి ఈ ఫోటోను తయారు చేశారు, అవి నిజమైన గాయాలు కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలిస్తున్న సమయంలో, వైరల్ వీడియోలో ఉన్న మొదటి ఫోటో కొలాజ్‌ను గతంలో మేము ఫ్యాక్ట్-చెక్ చేశాము అని గ్రహించాము. ‘బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్నును పీకేశాడు’ అని క్లెయిమ్ చేస్తూ ఈ ఫోటోని గతంలో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా, అది తప్పు అని చెప్తూ మేము ఒక ఫ్యాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించాము.
వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి బంగ్లాదేశ్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అద్రితా ఆజాద్ రీతి. తను పుట్టుకతో ముస్లిం అని, తను ఎలాంటి దాడికి గురికాలేదని, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని తన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేస్తూ ఏప్రిల్ 2025లో పోస్టు చేసింది. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు, బంగ్లాదేశీ సైబర్ సెక్యూరిటీ టీమ్ వారు కూడా స్పష్టం చేశారు.

ఇక రెండో ఫోటో గురించి మరిన్ని వివరాల కోసం ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోని 1 ఆగస్టు 2025న శ్వేతా పుందీర్ అనే కంటెంట్ క్రియేటర్ పోస్ట్ చేశారని మాకు తెలిసింది.

2 ఆగస్టు 2025న కూడా శ్వేత ఇదే ఎరుపు రంగు దుస్తుల్లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసిందని మేము గమనించాం, కానీ వాటిలో ఆమె ముఖంపై ఎటువంటి గాయాలు లేవు.

అలాగే, 2 ఆగస్టున ఆమె ఫేస్‌బుక్‌లో ఒక లైవ్ స్ట్రీమ్ చేశారు, అందులో ఆమె మొహం పైన ఎటువంటి గాయాలు లేవు. అందులో ఎక్కడ కూడా ఆమె, తనకు గాయాలు అయ్యాయి అని చెప్పలేదు.

కానీ, అదే రోజు ఆమె పోస్ట్ చేసిన మరో వీడియోలో, ఆమె ముఖంపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ, ప్రేమించుకునే వ్యక్తులు మధ్య హింసను సమర్థించే అమ్మాయిల గురించి ఆమె వ్యంగ్యంగా మాట్లాడారు. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీపై ఎప్పటికీ చేయి ఎత్తడు అని ఇందులో ఆమె చెప్పడం మనం చూడవచ్చు. ఈ వీడియోను జాగ్రత్తగా చూసినప్పుడు, శ్వేత ముఖ కవళికలు మారుతున్న కొద్దీ, ఆమె కళ్ళు, బుగ్గలపై ఉన్న గాయాల గుర్తులు కూడా మారడం మేము గమనించాము. దీనివల్ల, ఈ వీడియోను ఏదైనా డిజిటల్ ఫిల్టర్ ఉపయోగించి తయారు చేసి ఉండవచ్చని మాకు అనుమానం వచ్చింది.

3వ తేదీన తను చేసిన మరో లైవ్ స్ట్రీమ్‌లో తన మొహం పైన ఎటువంటి గుర్తులు లేకపోవడం కూడా ఈ అనుమానాన్ని బలోపేతం చేసింది. సాధారణంగా, ఇన్‌స్టాగ్రామ్ లేదా స్నాప్‌చాట్‌లో ఉండే ఫిల్టర్‌లను ఉపయోగించి తయారు చేసిన వీడియోలలో ఇలాంటివి కనిపిస్తాయి. స్నాప్‌చాట్‌లోని ఈ ఫిల్టర్‌లను ‘లెన్స్‌లు’ అంటారు.
దీని తర్వాత, శ్వేత ప్రొఫైల్ కోసం మేము స్నాప్‌చాట్‌లో వెతుకగా, తను 2 ఆగస్టున ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోని స్నాప్‌చాట్‌లో (శ్వేతా పుందీర్ అనే అకౌంటులో) కూడా పోస్ట్ చేశారని మాకు తెలిసింది. ఈ వీడియోని ‘mmmoort9’ ని లెన్స్ వాడి తయారు చేశారు అని ఈ వీడియో వివరణలో ఉంది. ఈ లెన్స్ ముఖాలపై గాయాల గుర్తులు కనబడేలా చేస్తుంది. వైరల్ ఫొటోలో ఉన్న చీర ధరించి, తను చేసిన మరో వీడియోను శ్వేతా స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని కూడా తను ఇదే లెన్స్ ఉపయోగించి తయారు చేశారు.

ఈ లెన్స్‌ను ఉపయోగించి తయారు చేసిన అనేక మంది యూజర్ల వీడియోలులో (ఇక్కడ, ఇక్కడ) కూడా ఇటువంటి గాయాల గుర్తులు ఉండటం మేము గమనించాము. అదనంగా, వైరల్ ఫొటోని తను ఈ స్నాప్‌చాట్ లెన్స్ వాడి తయారు చేశారని, ఆమె ఆరోగ్యకరంగా ఉన్నారని Newscheckerకు శ్వేతా చెప్పింది.

చివరగా, తమ ముస్లిం భర్తలు తన్నడం వల్ల గాయాలపాలైన ఇద్దరు హిందూ మహిళల ఫోటోలు అని చెప్తూ ఒక బంగ్లాదేశీ ముస్లిం మహిళ ఫోటో, శ్వేతా పుందీర్ అనే భారత కంటెంట్ క్రియేటర్ ఫోటోను తప్పుగా షేర్ చేస్తున్నారు