కంటిపై గాయంతో ఉన్న ఓ యువతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ ఫోటోను షేర్ చేస్తూ, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ హిందూ యువతి తన కుటుంబానికి వ్యతిరేకంగా ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది, రెండు నెలల తర్వాత అతడు ఆమె కన్నును పీకేశాడని క్లెయిమ్ చేస్తున్నారు.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్నును పీకేశాడు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): బంగ్లాదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి తన హిందూ భార్యపై దాడి చేసి ఆమె కన్ను పీకాడాడనే వాదనలో నిజం లేదు. వైరల్ ఫోటోలో కనిపిస్తున్న యువతి బంగ్లాదేశ్‌కు చెందిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అద్రితా ఆజాద్ రీతి. తను పుట్టుకతో ముస్లిం అని, తను ఎలాంటి దాడికి గురికాలేదని, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని తన ఫేస్‌బుక్‌లో స్పష్టం చేస్తూ పోస్టు చేసింది. కానీ ఆమె ఫోటోను ‘లవ్ జహాద్’గా తప్పుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పలు మీడియా సంస్థలు, బంగ్లాదేశ్ సైబర్ సెక్యూరిటీ టీమ్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రీతి భర్త మొహమ్మద్ అబూ సుఫియాన్ ఢాకాలోని పల్లబి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా మేము ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన సమాచారం కోసం వైరల్ ఫోటో ను గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా, ఈ ఫోటోలను బంగ్లాదేశ్ డిజిటల్ క్రియేటర్ అద్రితా ఆజాద్ రీతి తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో 18 ఏప్రిల్ 2025న పోస్ట్ (ఆర్కైవ్ లింక్) చేసినట్లు కనుగొన్నాము. ఈ పోస్ట్ వివరణలో, 17 ఏప్రిల్ 2025న రాత్రి సోనీ సినెప్లెక్స్ వెనుక రోడ్డులో హెల్మెట్ పెట్టుకుని స్కేటింగ్ చేస్తున్న ఓ అబ్బాయి రీథిని గమనించకుండా ఢీకొట్టాడని తెలిపింది. ఆ హెల్మెట్ ఆమె కుడి కంటిని తాకడంతో, కంటి చుట్టూ గాయమైందని రీతి తరఫున ఆమె భర్త ఈ పోస్ట్‌లో వివరించాడు.

వైరల్ క్లెయిమ్ ఫేక్ అని పేర్కొంటూ అద్రితా ఆజాద్ రీతి ఫేస్‌బుక్ హ్యాండిల్ లో మరొక పోస్ట్‌ను (ఆర్కైవ్ లింక్) కూడా మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ, “నేను పుట్టుకతో ముస్లింని. నా నేషనల్ ఐడీ కార్డులో మా నాన్న పేరు మొహమ్మద్ అబుల్ కలాం ఆజాద్ అని, తల్లి పేరు సల్మా సుల్తానా అని స్పష్టంగా ఉంది. నన్ను ఎవరూ కొట్టలేదు. 17వ తేదీన జరిగిన ప్రమాదంలో నేను గాయపడ్డాను. కానీ హిందుత్వవాదులు నా ఫోటోలను ఉపయోగించి ఫేక్ వార్తలను పంచుతున్నారు. దయచేసి అలాంటి అపోహలను వ్యాప్తి చేయడం ఆపండి” అని పేర్కొంది.

బంగ్లాదేశ్ హిందూ ఛాత్ర మహాజోత్ జెనరల్ సెక్రటరీగా తనను తను పేర్కొంటున్న జాయ్ రాజ్‌బోన్షీ అనే వ్యక్తి, తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో ఈ అంశంపై ఓ పోస్ట్ చేశాడు. అతను రీతి భర్త, మొహమ్మద్ అబూ సుహియన్, 18 ఏప్రిల్ 2025 న ఢాకా పల్లబి పోలీస్ స్టేషన్‌కు చేసిన ఫిర్యాదును కూడా షేర్ చేశాడు. ఆ ఫిర్యాదులో 17 ఏప్రిల్ 2025న రోడ్డు ప్రమాదంలో రీతి తీవ్రంగా గాయపడ్డారని, కొంతమంది రీతి ఫేస్‌బుక్ ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించి, వారి వివాహం, మతపరంగా సున్నితమైన వాదనల గురించి తప్పుడు సమాచారాన్ని పంచుకుంటున్నారని పేర్కొన్నాడు. తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగత మరియు కుటుంబ భద్రతకు రక్షణ కల్పించాలని లేఖలో డిమాండ్ చేశాడు.

మేము బంగ్లాదేశీ ఫాక్ట్-చెకర్ శోహానూర్ రహ్మాన్ చేసిన ఓ x-పోస్ట్‌ను (ఆర్కైవ్ లింక్) కూడా కనుగొన్నాము. ఆ పోస్ట్‌లో వైరల్ ఫోటోను షేర్ చేస్తూ, “ఫోటోలో కనిపిస్తున్న మహిళ పుట్టుకతో ముస్లిమ్, ఇటీవల ఒక ప్రమాదంలో గాయపడింది”, అని పేర్కొన్నాడు.
ఈ సంఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ సైబర్ సెక్యూరిటీ టీమ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము.

చివరిగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బంగ్లాదేశ్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ఫోటోను తప్పుడు మతపరమైన వాదనలతో షేర్ చేస్తున్నారు.