Fake News, Telugu
 

అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం కలిపి తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని, ఫలితంగా యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం ఉండదని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ అవసరం లేకుండా నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయి.

ఫాక్ట్: అల్లం, వెల్లుల్లి, తేనె, నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాయితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు, కొలెస్టరాల్, కాల్షియమ్ మరియు ఇతర వ్యర్థాలు పేరుకున్నప్పుడు పూడిక (Plaques) ఏర్పడి గుండె కండరాలకు వెళ్లే రక్తానికి అడ్డుగా మారుతుంది. దీని వల్ల ఛాతీ నొప్పి, ఊపిరి అందకపోవడం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, మధుమేహం, పొగత్రాగడం, ఊభకాయం మరియు జన్యుపరమైన సమస్యలు దీనికి ప్రధాన కారణాలుగా అధ్యయనాలు పేర్కొన్నారు.

ఆహార సమతుల్యత పాటించడం, ఉప్పు, కొవ్వు పదార్థాలు, చక్కెరని పరిమితంగా తీసుకోవడం, వ్యాయామం చెయ్యడం, ధూమపానం, మధ్యపానం మానెయ్యడం వంటివి చేస్తే గుండె నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి వైద్య సంస్థలు చెప్తున్నాయి. అయితే, తీవ్రస్థాయిలో గుండెనాళాలు మూసుకుపోయిన వారికి యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ వంటివి అవసరమని వైద్యులు చెప్తున్నారు. కేవలం ఆహారం ద్వారా గుండె నాళాల్లోని అడ్డంకులను తొలగించడానికి నిరూపంచబడ్డ పద్ధతి లేదు. అయితే, పైన చెప్పిన అలవాట్లను పాటిస్తే గుండె నాళాల్లో మరిన్ని అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.

ఇక వైరల్ పోస్టులో చెప్పిన నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు, కొలెస్టరాల్, రక్త ప్రసరణ, రోగనిరోధక శక్తి, మధుమేహం వంటివి కొంతమేరకు మెరుగుపడవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ ఈ మిశ్రమం తీసుకోవడం వల్ల గుండెనాళాల్లోనీ అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాధి కారణాన్ని గుర్తించి, దాన్ని బట్టి చికిత్స తీసుకోవడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

చివరిగా, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని తాగితే గుండె నాళాల్లోని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll