చేతులు లేకుండా, బుజాలు తెల్లటి టేపుతో కట్టబడి ఉన్న ఒక వ్యక్తి ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ), అతను హమాస్ ఉగ్రవాది మహమ్మద్ మహరూఫ్ అని, ఇతను 07 అక్టోబర్ 2023న జరిగిన దాడిలో కొంతమంది ఇజ్రాయెల్ పిల్లలను చంపడం, వారి మృతదేహాలను ఓవెన్‌లో ఉంచటం మరియు కొలనులో కొందరిని సజీవ దహనం చేయడం వంటి చర్యలకు బాద్యుడని షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: 2023లో ఇజ్రాయెల్ పిల్లలను చంపిన గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్ మొహమ్మద్ మహ్రూఫ్ చేతులను ఇజ్రాయెల్ దళాలు నరికి అతన్ని సజీవంగా వదిలేసింది.
ఫాక్ట్(నిజం): వైరల్ ఫొటోలో ఉన్నది హమాస్ తీవ్రవాది మొహమ్మద్ మహ్రూఫ్ కాదు, 15 ఏళ్ల పాలస్తీనా యువకుడు దియా అల్-అదీని. 13 ఆగస్టు 2024న గాజాలోని అల్-ఖస్తాల్ టవర్స్‌లోని అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం దాడిలో దియా అల్-అదీని తీవ్రంగా గాయపడ్డారు. వైద్య సామాగ్రి కొరత కారణంగా వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు అతని చేతులను తీసివేయాల్సి వచ్చింది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.
వైరల్ ఇమేజ్ గూగుల్ లెన్స్ సెర్చ్ చేస్తే, ఆగస్ట్ 2024లో ప్రచురించిన మీడియా కథనాలకు దారి తీసింది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ రిపోర్టుల ప్రకారం ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి 15 ఏళ్ల పాలస్తీనా యువకుడు దియా అల్-అదిని. 13 ఆగస్టు 2024న ఇజ్రాయెల్ దాడిలో ఇతని రెండు చేతులు తీసివేయబడ్డాయి. ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన తర్వాత గాజాలోని ఆసుపత్రిలో కనుగొనబడిన కొద్దిమంది పాలస్తీనా వారిలో దియా అల్-అదీనీ ఒకరు.
తదుపరి సెర్చ్ ‘అలమీ’ ఇమేజ్ వెబ్‌సైట్‌కి దారితీసింది, అక్కడ అదే బాలుడి ఫోటో అప్‌లోడ్ చేయబడటం మేము గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). ఇమేజ్ యొక్క వివరణలో “గాజాలోని డీర్ అల్ బలాహ్‌కు తూర్పున ఉన్న అల్-ఖస్తాల్ టవర్స్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయటంతో పాలస్తీనా యువకుడు డియా అల్-అదిని తీవ్రంగా గాయపడ్డాడు. అతను తన రెండు చేతులను కోల్పోయాడు. ఆసుపత్రులలో వైద్యం కొరత కారణంగా, వైద్యులు వారి ప్రాణాలను కాపాడటానికి చాలా మంది రోగుల అవయవాలను తీసివేశారు (అనువదించబడింది)” అని పేర్కొంది.
గెట్టి ఇమేజెస్ వెబ్‌సైట్‌లో కూడా అదే ఫోటోని మేము కనుగొన్నాము. ఈ వెబ్సైట్ కూడా ఇతన్ని దియా అల్-అదీనిగా గుర్తించింది.
తదుపరి, 07 అక్టోబర్ 2023 నుండి ఇజ్రాయెల్ చంపిన మిలిటెంట్లు, హిజ్బుల్లా మరియు హమాస్ సభ్యుల జాబితాలను కలిగి ఉన్న వార్తా కథనాలను (ఇక్కడ మరియు ఇక్కడ) మేము కనుగొన్నాము. అయితే ఈ జాబితాలలో ఏదీ కూడా మహమ్మద్ మహ్రూఫ్ అనే పేరు గల ఉగ్రవాది పేరు లేదు .
చివరిగా, ఆగస్ట్ 2024 ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన 15 ఏళ్ల దియా అల్-అదీని ఫోటోను అతను హమాస్ మిలిటెంట్ అనే తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.