Fake News, Telugu
 

మార్చి 2025లో అలీపుర్దువార్‌లో ముస్లిం వేషధారణలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన ఇద్దరు హిందువుల వీడియోను ముర్షిదాబాద్ అల్లర్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడఇక్కడఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్‌ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడఇక్కడఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ). 

ఈ అల్లర్ల నేపథ్యంలో, “పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన హిందువులు పట్టుబడ్డారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా ఓ ఫోటోను, ముస్లిం మతానికి సంబంధించిన టోపీలు ధరించిన ఇద్దరు వ్యక్తులను కొంతమంది వ్యక్తులు చుట్టుముట్టి  ప్రశ్నిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌లో ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన హిందువులు పట్టుబడ్డారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ఇటీవల ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో మార్చి 2025లో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలోని ఫలకటా పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం వేషధారణలో భిక్షాటన చేస్తూ పట్టుబడిన ఇద్దరు హిందువులను చూపిస్తుంది. అలీపుర్దువార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), కూడా ఈ సంఘటన మార్చి 2025 మొదటి వారంలో జరిగిందని, అలాగే ఈ ఘటనకు ఇటీవల ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ పోస్టులలో ఉన్న దృశ్యాలనే కలిగి ఉన్న వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ఫేస్‌బుక్‌లో ‘కౌశిక్ మైతి’ అనే యూజర్ 05 మార్చ్ 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ పోస్టు వివరణ ప్రకారం,  ఈ సంఘటన మార్చి 2025లో పశ్చిమ బెంగాల్‌లోని అలిపుర్దువార్ జిల్లాలో జరిగింది. బీహార్‌కు చెందిన ఇద్దరు హిందూ వ్యక్తులు ముస్లింల వేషంలో పట్టుబడ్డారని ఈ పోస్టు పేర్కొంది.

అలాగే, పలువురు మార్చి 2025లో ఫేస్‌బుక్‌లో ఇదే వీడియోను ఇదే వివరణతో షేర్ చేసినట్లు మేము గుర్తించాము (ఇక్కడఇక్కడ, & ఇక్కడ). దీన్ని బట్టి  ఈ వీడియో ఇటీవల వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసకు సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తుంది, ఎందుకంటే ఈ సంఘటన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 (ఏప్రిల్ 2025లో) ఆమోదం పొందటానికి ముందే జరిగింది.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం మేము అలీపుర్దువార్ జిల్లా పోలీసులను సంప్రదించాము, అలీపుర్దువార్ అదనపు ఎస్పీ, అసిమ్ ఖాన్ మాతో (Factly) మాట్లాడుతూ, “వైరల్ వీడియో చూపిస్తున్న సంఘటన 2025 మార్చి మొదటి వారంలో జరిగింది. ముస్లిం దుస్తులు ధరించిన ఇద్దరు వలస కార్మికులు (హిందువులు) ఫలకటా పోలీస్ స్టేషన్ పరిధిలో. భిక్షాటన చేస్తుండగా స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారు, దీని వలన ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది, అయితే ఈ సంఘటనలో  ఎటువంటి కేసు నమోదు కాలేదు, మారువేషంలో ఉన్న వ్యక్తులు ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడలేదు” అని  ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సంఘటనకు ఇటీవల జరిగిన ముర్షిదాబాద్ అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

దీన్ని బట్టి, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాకు చెందిన మార్చి 2025 నాటి ఒక వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారని స్పష్టమవుతోంది.

చివరగా, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల వేషధారణలో అల్లర్లకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన హిందువులు పట్టుబడ్డారు అంటూ సంబంధంలేని అలీపుర్దువార్ జిల్లాకు చెందిన మార్చి 2025 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll