Fake News, Telugu
 

చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ మరియు పోలీసు యూనిఫాంలో ఉన్న మహిళ ఒకరు కాదు

0

‘చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుంటూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఎస్ఐ అయ్యింది’ అని చెప్తూ, రెండు ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుంటూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఎస్ఐ అయిన పద్మశిల ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్ చేసిన ఫోటోలో పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నది తానేనని, కానీ తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ తాను కాదని ‘మహారాష్ట్ర టైమ్స్’ తో పద్మశిల తిర్పుడే తెలిపింది. తాను చాలా కస్టపడి ఎస్ఐ అయిన మాట వాస్తవమేనని, కానీ తాను రోళ్లు అమ్మలేదని ప్రస్తుతం నాగపూర్ లో పోలిస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పద్మశిల తిర్పుడే తెలిపింది. తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ తెలంగాణ లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిందని, ఆ మహిళ పోలీస్ అధికారి అయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథలో నిజం లేదని ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ వివరణ ఇచ్చాడు. కావున, ఇద్దరు వేరు వేరు మహిళల ఫోటోలు పెట్టి, వాటిల్లో ఉన్నది ఒకరే అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ ఫోటో గురించి ఇంటర్నట్ లో వెతకగా, ఇదే ఫోటోని ఒక ఫోటోగ్రాఫర్ జూలై 2017 లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదే ఫోటోగ్రాఫర్ ఆ మహిళ యొక్క మరో ఫోటోని అక్టోబర్ 2017 లో పెట్టి, ‘ఈ ఫోటోలో ఉన్న చెల్లెలది తెలంగాణ లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందింది. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఈమే పోలీసు అయిందని కథ వచ్చింది. ఇది అంతా కట్టు కథ. నిన్న కోరుట్లలో ఈమె అడ్రస్ కనుక్కొని వెలితె అక్కడ బాదాకరమైన విషయం తెలిసింది.దాదపు నేను ఫోటో తీసిన రెండు మూడు రోజులకు, చంకలో ఎత్తుకున్న ఆ మూడు నెలల పసిపాపకు జ్వరం వచ్చి ఆ కన్న తల్లికి దూరమైంది’, అని రాసాడు.

పోస్ట్ లోని మరో ఫోటో గురించి వెతకగా, ఆ ఫోటో కనీసం సెప్టెంబర్ 2013 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలో పోలీసు యూనిఫాం వేసుకొని ఉన్న మహిళ పేరు పద్మశిల తిర్పుడే. పోస్ట్ చేసిన ఫోటోలో పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నది తానేనని, కానీ తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ తాను కాదని ‘మహారాష్ట్ర టైమ్స్’ తో పద్మశిల తిర్పుడే తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు. తాను చాలా కస్టపడి ఎస్ఐ అయిన మాట వాస్తవమేనని, కానీ తాను రోళ్లు అమ్మలేదని ప్రస్తుతం నాగపూర్ లో పోలిస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పద్మశిల తిర్పుడే తెలిపింది. తను ‘Yashwantrao Chavan Maharashtra Open University (YCMOU)’ లో చదివింది; తన గురించి ఆ కాలేజీ వారు ప్రచురించిన సక్సెస్ స్టొరీ ఇక్కడ చదవొచ్చు. 2012 లో రిలీజ్ అయిన మహారాష్ట్ర ఎస్ఐ మెయిన్స్ పరీక్ష -2011 ఫలితాల్లో పద్మశిల తిర్పుడే పేరు ఉన్నట్టు కూడా చూడవొచ్చు.

చివరగా, పోస్టులోని ఫొటోలో చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ మరియు పోలీసు యూనిఫాంలో ఉన్న మహిళ ఒకరు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll