Fake News, Telugu
 

గణపతి విగ్రహం పెట్టడంపై రెండు హిందూ వర్గాల మధ్య జరిగిన గొడవని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ లోని లాల్ దర్వాజా లో గణపతి విగ్రహం పెడుతుంటే అభ్యంతరం తెలుపుతూ ముస్లింలు విగ్రహం యొక్క చెయ్యి విరగొట్టారు అని చెప్తూ, రెండు వర్గాలు కొట్టుకుంటున్న ఒక వీడియోని సోషల్ మీడియా లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: లాల్ దర్వాజా లో గణపతి విగ్రహం పెడుతుంటే అభ్యంతరం తెలుపుతూ ముస్లింలు విగ్రహం యొక్క చెయ్యి విరగొట్టినందున జరిగిన గొడవ వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఇరువర్గాలు హిందువులేనని, వారు దూరపు చుట్టాలు కూడా అని FACTLY తో మాట్లాడుతూ మొగల్‌పురా పోలిస్ స్టేషన్ SHO తెలిపారు. ఒక వర్గం వారు తమ ఇంటిముందు వినాయకుడి విగ్రహం పెట్టొద్దని అంటే, అక్కడే కొన్నేళ్లుగా విగ్రహం పెడుతున్నామని, ఈ సారి కూడా అక్కడే పెడతామని మరొక వర్గం వారు అనడంతో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ జరిగింది. అంతేకాదు, గొడవ లో విగ్రహం విరగలేదు. అంతకు ముందే విగ్రహాన్ని తరలిస్తున్నప్పుడు విరిగింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియోని మరికొందరు కూడా ఫేస్బుక్ లో పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు. అయితే, వారు ఎక్కడా కూడా ముస్లింల వల్ల గొడవ జరిగినట్టు రాయలేదు.

వీడియోలోని ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం మొగల్‌పురా పోలిస్ స్టేషన్ SHOని FACTLY సంప్రదించగా, అది మత ఘర్షణ కాదని, వీడియోలోని ఇరువర్గాలు హిందువులేనని, వారు దూరపు చుట్టాలు కూడా అని అయన తెలిపారు. ఒక వర్గం వారు తమ ఇంటిముందు వినాయకుడి విగ్రహం పెట్టొద్దని అంటే, అక్కడే కొన్నేళ్లుగా విగ్రహం పెడుతున్నామని, ఈ సారి కూడా అక్కడే పెడతామని మరొక వర్గం వారు అనడంతో ఇరు వర్గాల మధ్య చిన్న గొడవ జరిగిందని తెలిపారు. తరువాత ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందని, ఆ ఘటన పై తాము ఎలాంటి కేసు పెట్టలేదని తెలిపారు. అంతేకాదు, గొడవ లో విగ్రహం విరగలేదని, అది ముందే విగ్రహాన్ని తరలిస్తున్నప్పుడు విరిగిందని కూడా చెప్పారు.

చివరగా, వీడియోలో గొడవపడుతున్న ఇరువర్గాలు హిందువులే. వీడియోలోని ఘటనకు, ముస్లింలకు ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll