ఇటీవల (జూన్ 2024లో) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 22 మెట్రో రైళ్లు ప్రారంభమయ్యాయని, ఈ రైళ్ల కోచ్‌లు భారత్‌లో తయారయ్యి మొదటిసారిగా ఎగుమతి చేయబడ్డాయంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దీనికి బాగా తోడ్పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు షేర్ చేస్తున్నారు (ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల (జూన్ 2024లో) ఆస్ట్రేలియాలో ప్రారంభమైన 22 మెట్రో రైళ్లు భారత్‌లో తయారయ్యి ఎగుమతి చేయబడ్డాయి.
ఫాక్ట్(నిజం): ఇది పాత వార్త. ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్ అనే కంపెనీ 22 మెట్రోపాలిస్ రైళ్ల డెలివరీ కాంట్రాక్ట్ 2014లో దక్కించుకుంది. డిసెంబర్ 2018లో ఆంధ్ర ప్రదేశ్‌లోని తమ శ్రీసిటీ యూనిట్ ద్వారా చివరి రెండు రైళ్ల డెలివరీ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
సిడ్నీలో డ్రైవర్‌లెస్ మెట్రో ప్రాజెక్ట్ కోసం భారత్ నుండి 22 మెట్రో రైళ్లు ఆస్ట్రేలియాకు ఎగుమతి అయిన వార్త నిజమే అయినప్పటికీ ఈ వార్త 2018కు సంబంధించింది. పైగా ఈ రైళ్లు భారత్‌లో తయారు కాలేదు, కేవలం అసెంబుల్ అయ్యాయి. అలాగే ఈ కాంట్రాక్ట్ ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీకు వచ్చింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఫ్రాన్స్‌కు చెందిన అల్స్టోమ్ కంపెనీ ఈ విషయానికి సంబంధించి డిసెంబర్ 2018లో విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ మాకు కనిపించింది. కాంట్రాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలోని తమ యూనిట్ నుండి షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాకు రైళ్ల డెలివరీ చేసినట్టు దీని సారాంశం.
ఈ వార్తను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు కూడా మాకు కనిపించాయి. ఐతే ఈ కథనాల ప్రకారం ఈ రైళ్లు కేవలం భారత్ లో అసెంబుల్ అయ్యాయి. అల్స్టోమ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని తమ యూనిట్ లో ఈ రైళ్లను అసెంబుల్ చేసి, ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ చేసింది.
ఈ వార్తను రిపోర్ట్ చేసిన మరికొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ దీనికి తోడ్పడింది అంటూ ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఈ సమాచారం ఆధారంగా ఇది పాత వార్త అని అర్ధమవుతుంది.
చివరగా, 2018లో భారత్ నుండి ఆస్ట్రేలియాకు ఎగుమతి అయిన మెట్రో రైళ్లకు సంబంధించిన వార్తను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.