Fake News, Telugu
 

2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో యువకులను పోలీసులు కొట్టిన దృశ్యాలను 2025 సెప్టెంబర్‌లో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

‘ఐ లవ్ ముహమ్మద్ ‘I Love Muhammad’ పోస్టర్‌పై నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ మరియు మౌ నగరాల్లో 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. బరేలీలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఈ ఘటనలకు సంబంధించి కనీసం 12 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ నేపథ్యంలో, బరేలిలో పోలీసులపై రాళ్లు రువ్విన ఐ లవ్ మహ్మద్ నిరసనకారులను బరేలీ పోలీసులు అరెస్టు చేసి కొట్టిన దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి కొంతమంది యువకులను కొట్టడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సెప్టెంబర్‌ 2025లో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలలో పాల్గొన్న వ్యక్తులను బరేలీ పోలీసులు అదుపులోకి తీసుకుని కొడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు ఇటీవల సెప్టెంబర్ 2025 బరేలీ జిల్లాలో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్ I Love Muhammad నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ వైరల్ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది. రిపోర్ట్స్ ప్రకారం,జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ముహమ్మద్‌ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ముస్లింలు నిరసనల చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా అరెస్ట్ చేసిన కొంతమంది యువకులను సహరాన్‌పూర్‌ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొట్టారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కీఫ్రేములతో కూడిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 2022లో పబ్లిష్ అయిన ఈ వార్త కథనాల ప్రకారం (ఇక్కడఇక్కడ, & ఇక్కడ), ఈ వీడియోలోని దృశ్యాలు జూన్ 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన ఘటనకు సంబంధించినవి.

ఈ కథనాల ప్రకారం, జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ,  నవీన్ కుమార్ జిందాల్ ముహమ్మద్‌ ప్రవక్త పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ముస్లింలు నిరసనల చేపట్టారు, ఈ నిరసనల సందర్భంగా అరెస్ట్ చేసిన కొంతమంది యువకులను  సహరాన్‌పూర్‌ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్‌ BJP ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి X లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అయింది. ఇదే వీడియోను ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ కు చెందినదిగా పేర్కొంటూ జూన్ 2022లో తన X(ట్విట్టర్)లో పోస్ట్ చేసారు. దీన్ని బట్టి వైరల్ వీడియోలోని దృశ్యాలు 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన సంఘటనకు సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.

గతంలో కూడా ఇదే ఘటనకు సంబంధించిన మరొక వీడియో వేర్వేరు తప్పుడు వాదనలతో వైరల్ కాగా, వాటినీ ఫాక్ట్-చెక్ చేస్తూ Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొంతమంది యువకులను పోలీసులు కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది.

Share.

About Author

Comments are closed.

scroll