రాబోయే ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటి సమంత “నేను మీ సమంత, అభివృద్ధికి ఓట్ చేయండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు ” అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం .

క్లెయిమ్: 2024 ఎన్నికల కోసం “నేను మీ సమంత, అభివృద్ధికి ఓట్ చేయండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు ” అని సినీ నటి సమంత చెప్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 2024 ఏపీ ఎన్నికల్లో నటి సమంత టీడీపీకి ఓటు వేయమని కోరలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేపల్లె నియోజకవర్గం టీడీపీ ఎంఎల్ఎ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కి ఓట్ వేయాలని సమంత చెప్పిన వీడియోని ఎడిట్ చేస్తూ ఈ వీడియో రూపొందించారు. అసలైన 2019 వీడియోలో సమంత “నేను మీ సమంత, మన రేపల్లె మన అనగాని, అభివృద్ధికి ఓటు చేయండి, అనగాని సత్యప్రసాద్ గారికి ఓట్ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు” అని చెప్పింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన సమాచరం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 10 ఏప్రిల్ 2019న ‘ది హిందూ’ మీడియా సంస్థ ప్రచురించిన వార్తా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అప్పటి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, సినీనటి సమంత రేపల్లె నియోజకవర్గం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తు వీడియో సందేశం విడుదల చేసారు. “మన రేపల్లె మన అనగాని. అభివృద్ధికి ఓటు వేయండి. సైకిల్ గుర్తుక మీ ఓటు వేసి అనగాని సత్య ప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని నటి సమంత వీడియో సందేశం విడుదల చేసినట్లు వార్త కథనం రిపోర్ట్ చేసింది.

ఏప్రిల్ 2019లో వచ్చిన ఇండియా టుడే కథనం ప్రకారం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా కొందరు సమంత వీడియో పై విమర్శలు చేస్తు పోస్టులు చేసినట్లు తెలిసింది. సత్య ప్రసాద్‌కు ఓటు వేయమని చెప్పిందని విమర్శిస్తూ ఒక ట్విట్టర్ యూజర్ ప్రశ్నించగా, అందుకు సమంత స్పందిస్తూ (ఆర్కైవ్) “సత్య ప్రసాద్ ఒక మంచి వ్యక్తి అని.. తాను హైదరాబాద్ కు వచ్చినప్పటి నుండి ఆయన మరియు ఆయన సోదరి అనగాని మంజులతో పరిచయం ఉందని సమంత వివరించింది. అందుకే ఆయనకు ఓటు వేయమని కోరానని” తెలిపింది.
ఈ సమాచరం ఆధారంగా ఈ వైరల్ వీడియో యొక్క పూర్తి నిడివి గల వీడియోని యూట్యూబ్‌లో కనుగొన్నాము. ఈ వీడియో ఏప్రిల్ 2019లో యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోలో నటి సమంత మాట్లడుతూ “నేను మీ సమంత,మన రేపల్లె మన అనగాని, అభివృద్ధికి ఓటు చేయండి,అనగాని సత్యప్రసాద్ గారికి ఓట్ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి, సైకిల్ గుర్తుకే మీ ఓటు” అని అన్నారు. దీన్ని బట్టి అసలైన ఈ 2019 వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, నటి సమంత 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాటి రేపల్లె నియోజకవర్గం టీడీపీ ఎంఎల్ఎ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కి ఓట్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాత్రమే వీడియోలో కోరింది.

చివరగా, 2024 ఏపీ ఎన్నికల్లో నటి సమంత టీడీపీకి ఓటు వేయమని కోరలేదు, 2019ఎన్నికల సందర్భంగా అనగాని సత్యప్రసాద్‌కి ఓటు వేయాలని సమంత కోరిన వీడియోను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.