Fake News, Telugu
 

మోదీ చిన్నతనంలో మొసలిని ఇంటికి తీసుకొచ్చిన వాదనను వ్యతిరేకిస్తూ ఏ అటవీ అధికారి గుజరాత్‌లో మొసళ్ళు లేవని వ్యాఖ్యానించలేదు

0

ప్రధానమంత్రి మోదీ చిన్నతనంలో ఒక మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చిన విషయాన్ని ఇటీవల తమిళనాడులోని ఒక ప్రైవేటు పాఠశాల ఫస్ట్ క్లాస్ పాఠ్య పుస్తకంలో చేర్చింది. ఈ నేపథ్యంలో ‘అసలు గుజరాత్ చెరువులో మొసళ్ళు ఉన్నట్టు మా రికార్డుల్లో లేదంటూ, మోడీ చెప్పిన మొసలి విషయం నిజం కాదని,’ గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ అటవీ అధికారి వినీలా తీకాధర్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మోదీ చిన్నతనంలో మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చిన విషయం నిజం కాదు; అసలు గుజరాత్ చెరువులో మొసళ్ళు ఉన్నట్టు మా రికార్డుల్లో లేదు – చెందిన రిటైర్డ్ అటవీ అధికారి వినీలా తీకాధర్.

ఫాక్ట్ (నిజం): చిన్నతనంలో ఇంటికి ఒక మొసలి పిల్లను తీసుకొచ్చినట్టు మోదీ చేసిన వాదనను అటవీ అధికారి వ్యతిరేకించినట్టు ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ లేవు. అసలు వినీలా తీకాధర్ పేరుతో ఒక రిటైర్డ్ అటవీ అధికారి ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో 2012లో వడోదరలో సీ ఫాన్స్‌ను అక్రమంగా అమ్ముతున్న కొందరిని అటవీ అధికారులు పట్టుకున్న సందర్భంలో తీసింది. ఫోటోలో ఉన్నది అప్పటి రేంజ్ ఆఫీసర్ నిధి దవే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తన చిన్నతనంలో ఒకసారి మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చినట్టు, 2019లో జరిగిన ‘మ్యాన్ vs వైల్డ్’ అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తెలిపాడు. అంతకు ముందు ఇదే విషయాన్ని గతంలో ఒకసారి మోదీ సోదరుడు కూడా మీడియాతో చెప్పాడు.

ఐతే ఈ విషయాన్ని ఇటీవల తమిళనాడులోని ఒక పాఠశాల ఫస్ట్ క్లాసు పాఠ్య పుస్తకంలో చేర్చిన నేపథ్యంలో, అసలు గుజరాత్ చెరువులో మొసళ్ళు లేవని, మోదీ మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చిన వాదనను వ్యతిరేకిస్తూ ఏ అటవీ అధికారి వ్యాఖ్యానించలేదు. ఒకవేళ ఇలా ఎవరైనా వ్యాఖ్యానించి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ అలాంటి కథనాలేవి మాకు లభించలేదు.

అసలు వినీలా తీకాధర్ పేరుతో గుజరాత్‌కు చెందిన రిటైర్డ్ అటవీ అధికారి ఉన్నట్టు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. ఇకపోతే పోస్టులో షేర్ చేసిన ఫోటోలో ఉన్నది వడోదర అటవీ విభాగానికి చెందిన రేంజ్ ఆఫీసర్ నిధి దవే. ఈ ఫోటో 2012లో వడోదరలో సీ ఫాన్స్‌ను అక్రమంగా అమ్ముతున్న కొందరిని అటవీ అధికారులు పట్టుకున్న సంధర్భానికి సంబంధించింది. అప్పట్లో ఈ వార్తను ప్రచురించిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, మోదీ చిన్నతనంలో మొసలి పిల్లను ఇంటికి తీసుకొచ్చిన వాదనను వ్యతిరేకిస్తూ అసలు గుజరాత్ చెరువులో మొసళ్ళు లేవని ఏ అటవీ అధికారి వ్యాఖ్యానించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll