2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ 23 ఏప్రిల్ 2024న భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో ఈ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజాలేమిటో తెలుసుకుందాం.

క్లెయిమ్: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోను 04 నవంబర్ 2019న జనసేన పార్టీ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో “Aerial View | JanaSena Party Long March at Visakhapatnam Against YSRCP Sand Policy | Pawan Kalyan” అనే శీర్షికతో పబ్లిష్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియో 03 నవంబర్ 2019న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇసుక పాలసీ కారణంగా ఏపీలో ఏర్పడిన ఇసుక కొరతకు నిరసనగా జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించినదిగా తెలిసింది. ఈ జనసేన మార్చ్‌ను రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ వీడియోలోని దృశ్యాలను, 2019లో జనసేన పార్టీ విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ దృశ్యాలతో పోల్చి చూస్తే, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఈ జనసేన లాంగ్ మార్చ్‌కు సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.

చివరగా, 2019లో జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు సంబంధించిన వీడియోను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.