Fake News, Telugu
 

2017లో హిందీ బోర్డులకి నలుపు రంగు పుస్తున్న ఫోటోలని ఇప్పటి రైతు నిరసనలకు ముడి పెడుతున్నారు

0

‘రిలయన్స్ జియో టవర్లు ధ్వంసము చేసాక ఇప్పుడు హిందీ ఉండకూడదు అంటూ హిందీ బోర్డులకు నల్ల రంగు పూస్తున్న రైతుల ముసుగులోని వ్యతిరేక శక్తులు’, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న నేపధ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నిరసన చేస్తున్న రైతులు ఇప్పుడు రహదారి పై ఉన్న హిందీ బోర్డులకి నల్ల రంగు పుస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు, పంజాబ్ రాష్ట్రంలో సిక్కు ఉద్యమకారులు నిర్వహించిన ఒక పాత ర్యాలీకి సంబంధించినవి. 2017లో పంజాబ్ రహదారులపై ఉన్న సైన్ బోర్డులపై పంజాబీ బాష పై వరుసలో ఉండాలని సిక్కు ఉద్యమకారులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ఫొటోలకి వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘India TV’ న్యూస్ వెబ్ సైట్ 25 అక్టోబర్ 2017 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. పంజాబ్ రహదారులపై ఉన్న హిందీ బాష సైన్ బోర్డులకి కొన్ని సిక్కు సంస్థలకి చెందిన కార్యకర్తలు నలుపు రంగు పూసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. రహదారులపై ఉన్న సైన్ బోర్డులపై పంజాబీ బాష అక్షరాలు పై వరుసలో ఉండాలని సిక్కు సంస్థల కార్యకర్తలు బటిండా -ఫరిడ్కోట్ రహదారి పై ఈ భారి ర్యాలీ నిర్వహించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. దళ్ ఖాల్స, SAD (అమ్రిత్సర్), BKU (క్రాంతికారి) కి చెందిన కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఇదే విషయాన్నీ ‘India TV’ న్యూస్ వెబ్ సైట్ తమ యూట్యూబ్ వీడియోలో రిపోర్ట్ చేసింది.

2017లో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ ర్యాలికి సంబంధించి Khalsa Force న్యూస్ వెబ్ సైట్ ‘10 అక్టోబర్ 2017’ మరియు ‘21 అక్టోబర్ 2017’ నాడు ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ర్యాలీ పూర్తి వీడియోని ‘Khalsa Force’ తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. ఈ ర్యాలీకి సంబంధించిన వివరాలు తెలుపుతూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు 2017లో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఒక ర్యాలీకి సంబంధించినవి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పోస్టులోని అదే క్లెయిమ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా యూసర్లు ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని ఒక యూసర్ ‘22 ఫిబ్రవరి 2019’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియో ఎక్కడిది అని తెలుయనప్పటికి, రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2017లో సిక్కు ఉద్యమకారులు రహదారులపై ఉన్న హిందీ బోర్డులకి నలుపు రంగు పుస్తున్న ఫోటోలని రైతు నిరసనలకు ముడి పెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll