Fake News, Telugu
 

2012లో రైతులకు యోగి ఆదిత్యనాథ్ ఆర్ధిక సహాయం చేస్తున్న దృశ్యాలని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు జత చేస్తు షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వోట్ల కోసం ప్రజలకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వోట్ల కోసం ప్రజలకు డబ్బులు పంచుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో చాలా పాతది. 2012లో కరువుతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోరఖ్‌పూర్ జిల్లాలో రైతులకు యోగి ఆదిత్యనాథ్ ఆర్ధిక సహాయం చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పార్లమెంట్ సభ్యుడి హోదాలో యోగి ఆదిత్యనాథ్, తన ఎంపి ఫండ్ నిధులతో గోరక్పూర్ కరువు బాధితులకు 1000-2000 వరకు డబ్బులు పంచారు. ఈ వీడియో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని చాలా మంది సోషల్ మీడియా యూసర్లు 2019 లోక్‌సభ ఎన్నికలకు నేపథ్యంలో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే, ఇవే దృశ్యాలు కలిగిన ఒక వీడియోలోని సంబాషణల బట్టి, యోగి ఆదిత్యనాథ్ డబ్బులు పంచుతున్నది గోరఖ్‌పూర్ ప్రజలకు అని, భూమి స్థలాల సంఖ్య ఆధారంగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు డబ్బులు పంచుతున్నారని స్పష్టమయ్యింది. దీన్ని బట్టి, ఈ వీడియో పాతది అని, ఎన్నికలకు సంబంధించి కాదని చెప్పవచ్చు.

ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, 2019లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ జిల్లా రైతులకు ఆర్ధిక సహాయం చేసారని తెలుపుతూ ఈ వీడియోని ఎటువంటి వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. అయితే, ఈ వీడియోకి సంబంధించి ‘The Quint’ న్యూస్ సంస్థ 2019లో ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వీడియోని మొట్టమొదట వినయ్ కుమార్ గౌతం అనే జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసారని ‘The Quint’ తెలిపింది. 2012లో గోరఖ్‌పూర్ జిల్లాలో కరువుతో బాధపడుతున్న రైతులకు యోగి ఆదిత్యనాథ్ ఆర్ధిక సహాయం చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుందని వినయ్ కుమార్ ‘The Quint’కు తెలిపారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో యోగి ఆదిత్యనాథ్, తన ఎంపి ఫండ్ నిధులతో గోరఖ్‌పూర్ కరువు బాధితులకు 1000-2000 వరకు డబ్బులు పంచినట్టు వినయ్ కుమార్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ఈ వీడియోని వినయ్ కుమార్ గౌతం తన యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2012లో యోగి ఆదిత్యనాథ్ కరువుతో నష్టపోయిన రైతులకు ఆర్ధిక సహాయం చేస్తున్న దృశ్యాలని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు జత చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll