1948 లో తెలంగాణా నుంచి నిజాం రజాకార్ల చేత తరిమి వేయబడుతున్న హిందూ కుటుంబాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ నిజాం రాజుల ప్రత్యేక సైనిక దళమైన రజాకార్లు, హిందువులు నివసిస్తున్న గ్రామాలపై అఘాయిత్యాలకి పాల్పడ్డారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1948 లో తెలంగాణా నుంచి నిజాం రజాకార్ల చేత తరిమి వేయబడుతున్న హిందూ కుటుంబాల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో తెలంగాణా లేదా అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. 1971 లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ద సమయంలో, ఈస్ట్ పాకిస్తాన్ లో నివసిస్తున్న సామాన్య ప్రజలు భారత్ కి వలస వస్తున్నపుడు తీసిన ఫోటో ఇది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ బంగ్లాదేశ్ కి చెందిన ‘Bangla 24livenewspaper’ న్యూస్ వెబ్ సైట్ ‘09 మార్చ్ 2017’ నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 1971 లో జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ యుద్ద సమయంలో, ఈస్ట్ పాకిస్తాన్ లో నివసిస్తున్న సామాన్య ప్రజలు భారత్ కి వలస వెళుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది, అని ఆర్టికల్ లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ కి చెందిన ‘ The Independent bd’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో కూడా ఈ ఫోటో 1971 లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి భారత్ కూ తరలి వెళుతున్న శరణార్దులదని వివరణ ఇచ్చారు.
ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘Ajker Ograbani’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో తెలంగాణా లేదా అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 1971 లో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి భారత్ కు తరలి వెళుతున్న శరణార్దుల ఫోటోని చూపిస్తూ తెలంగాణా నుంచి హిందువులను తరిమేస్తున్న నిజం రజాకార్లదని షేర్ చేస్తున్నారు.