ఇటీవల దేశంలో వివిధ వస్తువులు, సేవల పైన GST రేట్లను సవరించిన నేపథ్యంలో, “జీఎస్టీ ఇక అద్దె ఇళ్లకు కూడా పన్ను చెల్లించాల్సిందే. మీరు అద్దెకు తీసుకున్నవారు అయితే 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది” అని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఇంటిని అద్దెకు తీసుకున్నవారు 18% GST చెల్లించాలి.
ఫ్యాక్ట్ (నిజం): GST రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపార సంస్థ/వ్యక్తి వ్యాపార అవసరాలకు నివాస భవనాన్ని అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే 18% GST కట్టాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు GST చల్లించాల్సిన అవసరం లేదు. అందువలన ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ విషయంపై ఇంటర్నెట్లో వెతకగా, 12 ఆగస్టు 2022న ‘PIB Fact Check’ చేసిన ట్వీట్ లభించింది.
PIB Fact Check వారు చేసిన ట్వీట్ ప్రకారం:
- నివాస భవనాన్ని (Residential Unit) వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే GST కట్టాల్సి ఉంటుంది.
- ప్రైవేట్ వ్యక్తికి వ్యక్తిగత అవసరాలకు అద్దెకు ఇస్తే GST ఉండదు.
- వ్యాపార సంస్థ యజమానికి లేదా భాగస్వామికి వ్యక్తిగత అవసరాలకు అద్దెకు ఇచ్చినా కూడా GST ఉండదు.
ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ PIB వారు 29 జూన్ 2022న ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. ఇందులో ‘నివాస భవనాలను వ్యాపార సంస్థలకు (GST రిజిస్టర్ అయిన వ్యక్తులకు లేదా సంస్థలకు) అద్దెకు ఇవ్వడం’ అనే సర్వీస్‌ను GST పరిధిలోకి తీసుకురావాలన్న సూచన ఉంది.
ఇదే విషయాన్ని GST కౌన్సిల్ వెబ్సైటు విడుదల చేసిన న్యూస్ లెటర్ మరియు ప్రెస్ రిలీజ్ లో కూడా చూడవచ్చు.
CBIC వెబ్సైటు విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఈ సూచనలను 18 జులై 2022 నుంచి GST పరిధిలోనికి తెచ్చారు.
ఇదే సూచనలను పాటిస్తూ చేసిన సవరణను CBIC-GST వెబ్సైటులో కూడా చూడవచ్చు.
ఇక, ఇదే విషయాన్ని వివరిస్తూ వార్తా కథనాలు కూడా వచ్చాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
GST రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి? ఎవరెవరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
GST రిజిస్ట్రేషన్ అనేది పన్ను చెల్లింపుదారుడు GST కింద నమోదు చేసుకునే ప్రక్రియ. వ్యాపారం విజయవంతంగా నమోదు చేయబడిన తర్వాత, వారికి ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించబడుతుంది, దీనిని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (GSTIN) అంటారు. సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు (ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు రూ. 20 లక్షలు) ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.40 లక్షలకు మించిన వస్తువుల సరఫరాలో పాల్గొనే ఏదైనా వ్యాపారం ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు (ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు రూ. 10 లక్షలు) ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.20 లక్షలకు మించిన సేవల సరఫరాలో పాల్గొన్న ఏదైనా వ్యాపారం కూడా ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని పై మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇంటి అద్దె పైన ఎవరు ఎంత GST కట్టాలో క్రింది పట్టికలో చూడవచ్చు:
నివాస భవనాన్ని అద్దెకు తీసుకున్నది ఎవరు? | అద్దెకు తీసుకున్న కారణం? | GST ఎంత కట్టాలి? |
ఉద్యోగం చేస్తున్న వ్యక్తి | వ్యక్తిగత అవసరం | 0 |
GST రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపార సంస్థ/ వ్యక్తి | వ్యాపార కార్యక్రమాలు/ ఉద్యోగుల నివాసం లేదా గెస్ట్ హౌస్ | 18% |
GST రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి/ వ్యాపార సంస్థ యొక్క యజమాని లేదా భాగస్వామి | వ్యక్తిగత అవసరం (వ్యాపార ఖర్చులో చూపనప్పుడు) | 0 |
GST రిజిస్ట్రేషన్ చేసుకోని వ్యక్తి/ వ్యాపార సంస్థ | వ్యక్తిగత/ వ్యాపార కార్యక్రమాలు | 0 |
చివరిగా, GST రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపార సంస్థ/వ్యక్తి వ్యాపార అవసరాలకు నివాస భవనాన్ని అద్దెకు తీసుకున్నప్పుడు మాత్రమే 18% GST కట్టాల్సి ఉంటుంది.