కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో హిందూ దేవాలయాల నుండి వచ్చిన ఆదాయంలో 330 కోట్ల రూపాయలను వక్ఫ్ మరియు క్రిస్టియన్ వర్గాలకు కేటాయించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో హిందూ దేవాలయాల నుండి వచ్చిన ఆదాయాన్ని వక్ఫ్ మరియు క్రిస్టియన్ వర్గాలకు కేటాయించింది.
ఫాక్ట్(నిజం): కర్ణాటకలో అమలులో ఉన్న హిందూ ఎండోమెంట్ చట్టాల ప్రకారం హిందూ దేవాలయాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని తిరిగి హిందూ దేవాలయాలు మరియు వాటికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఖర్చు చేయాలి. ఈ చట్టాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసినట్టు తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల 16 ఫిబ్రవరి 2024 నాడు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టే ఈ బడ్జెట్‌లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ & అభివృద్ధి కోసం రూ.100 కోట్లు, క్రిస్టియన్ కమ్యూనిటీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు కేటాయించింది. మైనారిటీ సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసింది. కేవలం ఈ రెండు వర్గాలకే కాకుండా సిఖ్, జైన్, మొదలైన ఇతర మైనారిటీ వర్గాలకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.
ఐతే ప్రభుత్వం ఈ కేటాయింపులు హిందూ దేవాలయాల నుండి వచ్చిన ఆదాయం నుండి చేసిందన్న వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే కర్ణాటకలో అమలులో ఉన్న హిందూ ఎండోమెంట్ చట్టాల (The Hindu Religious Institutions And Charitable Endowments Act, 1997) ప్రకారం హిందూ దేవాలయాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని తిరిగి హిందూ దేవాలయాలు మరియు వాటికి సంబంధించిన అంశాలపై మాత్రమే ఖర్చు చేయాలి. ఈ చట్టంలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా హిందూ దేవాలయాల ఆదాయాన్ని ఇతర వాటికి కాకుండా కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలకే కేటాయించబడతాయి.
హిందూ దేవాలయాల ఆదాయాలను ఇతర మతాలకు ఖర్చు చేస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతుండడంతో రాష్ట్ర మంత్రి ట్విట్టర్ ద్వారా ఇదే అంశాన్ని స్పష్టం చేసాడు. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం 2024-2025 బడ్జెట్‌లో కేవలం మైనారిటీలకు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలకు కూడా కేటాయింపులు చేసింది, ఈ వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఈ సమాచారాన్ని బట్టి హిందూ దేవాలయాల ఆదాయాన్ని ఇతర మతాలకు ఖర్చు చేస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, కర్ణాటక ప్రభుత్వం హిందూ దేవాలయాల ఆదాయాన్ని ఇతర మతాలకు ఖర్చు చేస్తుందన్న వాదన కరెక్ట్ కాదు.