భీమవరం మరియు నర్సాపురం నియోజికవర్గాల్లో పోలైన ఓట్లకి మరియు కౌంటింగ్ లో అందరి అభ్యర్థులకు కలిపి వచ్చిన ఓట్లకి చాలా తేడా ఉందంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): భీమవరం లో పోలైన ఓట్లు 168005 అయితే, కౌంటింగ్ లో అందరి అభ్యర్థులకు కలిపి 190565 ఓట్లు వచ్చాయి. నర్సాపురం లో పోలైన ఓట్లు 120090 అయితే, కౌంటింగ్ లో అందరి అభ్యర్థులకు కలిపి 134444 ఓట్లు వచ్చాయి.
ఫాక్ట్ (నిజం): ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ‘Voter Turnout’ మొబైల్ అప్లికేషన్ లో భీమవరం లో పోలైన ఓట్ల సంఖ్య 192294 గా మరియు నర్సాపురం లో పోలైన ఓట్ల సంఖ్య 138975 గా ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వివరాల కోసం ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ వెతకగా, రిజల్ట్స్ కోసం వేరేగా పెట్టిన వెబ్ పేజీ లో కౌంటింగ్ రోజున అభ్యర్థులకు వచ్చిన ఓట్ల సంఖ్యలు దొరుకుతాయి. ఆ వెబ్ సైటు లో ఉన్న సమాచారం ప్రకారం భీమవరం నియోజికవర్గం లో అందరి అభ్యర్థులకు కలిపి పోస్టల్ బాలెట్స్ తో సహా 192061 ఓట్లు వస్తే, నర్సాపురం లో 136556 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బాలెట్ ఓట్లు తీసేస్తే పోస్ట్ లో భీమవరం సంఖ్య కరెక్ట్ గానే ఉంది కానీ నర్సాపురం లో అన్ని రౌండ్ల తర్వాత ఉన్న సంఖ్య కి మరియు పోస్ట్ లో ఇచ్చిన సంఖ్య కి మ్యాచ్ కాలేదు.
పోలింగ్ రోజున భీమవరంలో పోలైన ఓట్ల సంఖ్య కోసం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన ‘‘Voter Turnout’ మొబైల్ అప్లికేషన్ లో వెతకగా భీమవరం లో 192294 గా ఉంటే, నర్సాపురం లో 138975 గా ఉంటుంది. ఈ రెండు సంఖ్యలు పోస్ట్ లో ఇచ్చిన సంఖ్యలతో అస్సలు మ్యాచ్ అవ్వవు.
పోలింగ్ రోజున పోలైన ఓట్ల సంఖ్యలకు 12th ఏప్రిల్ న సాక్షి పేపర్ లో వచ్చిన సంఖ్యలను ఆధారంగా చూపెడుతున్నారు. సాక్షి వెబ్ సైట్ లో ఆ రోజు ప్రచురించిన ఆర్టికల్ చూడగా, ఇచ్చిన సంఖ్యలు పోలింగ్ రోజున తొమ్మిది గంటలవరకు వచ్చిన సమాచారం ప్రకారం ఇచ్చినట్టుగా ఉంటుంది. తొమ్మిది గంటల తర్వాత కూడా పోలింగ్ రోజు చాలా చోట్ల ఓటింగ్ జరిగింది. సాక్షి ఆర్టికల్ చూస్తే పశ్చిమ గోదావరి లో 70.59 ఓటింగ్ శాతం నమోదు అయ్యినట్టుగా ఉంటుంది కానీ 13th ఏప్రిల్ న ఎలక్షన్ కమిషన్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సమాచారంలో పశ్చిమ గోదావరి లో ఓటింగ్ శాతం 82.19 అయ్యినట్టుగా ఉంటుంది. కావున సాక్షి లో ఉన్న సంఖ్యలు మొత్తం ఎలక్షన్ అయ్యాక వచ్చిన సంఖ్యలు కావు.
చివరగా, భీమవరం మరియు నర్సాపురం నియోజికవర్గాల్లో వోటింగ్ పూర్తి కాకముందు ఇచ్చిన సంఖ్యలను తీసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా జరుగుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చుడండి