Fake News, Telugu
 

మలాలా కశ్మీర్ ట్వీట్ కి సమాధానం ఇస్తూ NSA అజిత్ ధోవల్ ట్వీట్ చేయలేదు. అసలు తనకి అధికారిక ట్విట్టర్ ఖాతానే లేదు

0

నోబెల్ బహుమతి గ్రహీత, పాకిస్తాన్ ఉద్యమకారిణి మలాలా యూసఫ్‌జాయ్ కశ్మీరీ మహిళలు మరియు పిల్లలపై ఆందోళనగా ఉంది అంటూ ఇటీవల పెట్టిన ట్వీట్ కి కౌంటర్ గా NSA అజిత్ ధోవల్ సమాధానం ఇచ్చాడు అంటూ కొంతమంది ఫేస్బుక్ పోస్టుల్లో ఆరోపిస్తున్నారు. ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులో ఈ విధంగా ఉంది- “పాకిస్తాన్ లో కాల్పులకు గురై ,భద్రతా కారణాలతో పాకిస్తాన్ విడిచి పెట్టి బ్రిటన్ లో స్థిరపడ్డ ఓ బాలికా , ఇది చాలా సిగ్గుచేటు నీ సొంత దేశంలో నివసించలేక పోయిన నీవు లక్షలాది మంది ప్రజలను అక్కడ నివసించమని కోరుతున్నావు, ఈ చెత్త మాటలు మాట్లాడే ముందు నువ్వు పాకిస్తాన్ లో స్థిరపడాలని సవాల్ చేస్తున్నా”. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : మలాలా యూసఫ్‌జాయ్ ఇటీవల కశ్మీరుపై పెట్టిన ట్వీట్‌కు భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు- “పాకిస్తాన్ లో కాల్పులకు గురై ,భద్రతా కారణాలతో పాకిస్తాన్ విడిచి పెట్టి బ్రిటన్ లో స్థిరపడ్డ ఓ బాలికా, ఇది చాలా సిగ్గుచేటు నీ సొంత దేశంలో నివసించలేక పోయిన నీవు లక్షలాది మంది ప్రజలను అక్కడ నివసించమనికోరుతున్నావు, ఈ చెత్త మాటలు మాట్లాడే ముందు నువ్వు పాకిస్తాన్ లో స్థిరపడాలని సవాల్ చేస్తున్నా”.

ఫాక్ట్ (నిజం): అజిత్ ధోవల్ అటువంటి వ్యాఖ్యలు ఏవీ చెయ్యలేదు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలతో అజిత్ దోవల్ పేరిట చలామణి అవుతున్నది ఆయన పేరు మీద ఉన్న ఒక అభిమానుల ట్విట్టర్ అకౌంట్ లోనిది . అసలు అజిత్ ధోవల్ కి అధికారికంగా ట్విట్టర్ లో అకౌంట్ లేదు. కావున పోస్ట్ లో చెప్పినది అబద్ధం.    

మలాలా యూసఫ్‌జాయ్ ఇటీవల కశ్మీరుపై పెట్టిన ట్వీట్‌ కు కౌంటర్ గా నిజంగానే అజిత్ ధోవల్ పోస్టులో ఆరోపించిన వ్యాఖలు చేశాడా అని వెతికినప్పుడు, “ఆంధ్రజ్యోతి” వార్తా పత్రిక వారు ప్రచురించిన కథనం లభించింది. అందులో వారు అజిత్ ధోవల్ ఆ వ్యాఖ్యలు ట్విట్టర్ లో చేశారని చెప్తూ ఆ ట్వీట్ ని అందులో పొందుపరిచారు.

ఆ ట్వీట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ యొక్క వివరణ (డిస్క్రిప్షన్ ) చూసినప్పుడు, అందులో “National Security Advisor fc.” అని ఉంది. ‘fc’ అనే అక్షరాలు సాధారణంగా ఫ్యాన్ క్లబ్ (అభిమానుల సంఘం) కి వాడుకగా ఉపయోగిస్తారు. దాన్ని బట్టి, అది అజిత్ ధోవల్ పేరు మీద ఉన్న ఒక అభిమానుల ట్విట్టర్ అకౌంట్ అని తెలుసుకోవచ్చు. ఒకరి పేరు మీద అభిమానులు ట్విట్టర్ అకౌంట్ వాడుకకు సంబంధించి ట్విట్టర్ సంస్థ అధికారిక పాలసీ ఇక్కడ చూడొచ్చు.

ఆ ట్విట్టర్ అకౌంట్ లోని ఇతర ట్వీట్లను చూడగా, అందులో పెట్టే ట్వీట్ లు వ్యంగ్యంగా ఉన్నట్లుగా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అజిత్ ధోవల్ పోస్టు లో ఆరోపించిన వ్యాఖ్యల గురించి గూగుల్ లో వెతికినప్పుడు, ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఏ ఇతర వార్తా సంస్థ కూడా ప్రచురించలేదు. అసలు అజిత్ ధోవల్ కి అధికారికంగా ట్విట్టర్ లో అకౌంట్ ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ‘Factly’ వారు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు, వారు అసలు తనకి ఎటువంటి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదని, ఆ ట్వీట్ కి అజిత్ ధోవల్ కి సంబంధం లేదని తెలిపారు.

గతంలో కూడా పాకిస్తాన్ భారత్‌తో అన్ని ద్వైపాక్షిక ట్రేడ్‌లను రద్దు చేసినందుకు స్పందిస్తూ అజిత్ దోవల్ ట్వీట్ చేసాడని ఆదే ట్విట్టర్ అకౌంట్ లోని ట్వీట్ వ్యాప్తి చెందినప్పుడు, అది అబద్ధం అని ‘Factly’ ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, మలాలా కాశ్మీర్ కి సంబంధించి ఇటీవల పెట్టిన ట్వీట్ కి సమాధానం ఇస్తూ NSA అజిత్ ధోవల్ ట్వీట్ చేయలేదు. అసలు తనకి అధికారిక ట్విట్టర్ ఖాతానే లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll