Fake News, Telugu
 

కరెంటు మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకున్నా, ప్రజలపై అదనపు భారం పడదు

0

నెలకు ఇవ్వాల్సిన కరెంట్ బిల్లుని కావాలని నెల కంటే ఎక్కువ రోజులకి ఇస్తూ విద్యుత్ అధికారులు ప్రజలని మోసంచేస్తున్నారని, దీని వల్ల సుమారు రెండింతలు కరెంట్ బిల్లుగా ప్రజలు కడుతున్నారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరెంటు మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకోవడం వాళ్ళ స్లాబు మరి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది.

ఫాక్ట్ (నిజం): మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకున్నా, ప్రజలపై అదనపు భారం పడదు. కావున మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకోవడం వాళ్ళ కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది అనుకోవడం తప్పు.

కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారు:

2018-19 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన ‘Retail Supply Tariff Schedule for FY 2018-19’ ప్రకారం, ‘డొమెస్టిక్’ కేటగిరీ లో మూడు స్లాబులు ఉన్నాయి. ఒక నెలలో ఉపయోగించిన యూనిట్ల ప్రకరం, ఇచ్చిన మూడు స్లాబుల్లో ఏదో ఒక స్లాబు లో వినియోగదారుడు ఉంటాడు. ఆ స్లాబ్ రేటు ప్రకారం తన బిల్లు లెక్కింపబడుతది.

కరెంట్ బిల్లులో కేవలం ‘Energy Charges’ మాత్రమే కాకుండా, ఇంకొన్ని చార్జీలు కూడా జోడిస్తారు. వాటిని కింది ఉన్న నమూనా బిల్ లో చూడవచ్చు.

మీటర్ రీడింగ్ ఎన్ని రోజులకి తీసుకోవాలి:

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన ‘Code of Practice on Payment of Bills by Consumers and for Disconnecting Electricity Supply for Non-Payment’ ప్రకారం, కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పుడే వినియోగదారుడికి కొన్ని విషయాలను కరెంట్ సప్లై చేసే సంస్థ తెలపాలి:

  1. కరెంట్ బిల్లు నెలకు వస్తుందా లేదా రెండు నెలలకు ఒకసారి వస్తుందా అని
  2. నెలలో ఏ రోజు మీటర్ రీడింగ్ తీసుకుంటారో అని
  3. బిల్ డేట్
  4. బిల్ కట్టాల్సిన డేట్

మీటర్ రీడింగ్ తీసుకుంటామని చెప్పిన రోజే (నెలకు ఒకసారి) కరెంట్ సప్లై చేసే సంస్థవారు మీటర్ రీడింగ్ తీసుకోవాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి చెప్పిన తేదీకి రెండు రోజుల ముందు కానీ, రెండు రోజులు తర్వాత కానీ, మీటర్ రీడింగ్ తీసుకొని బిల్లు ఇవ్వొచ్చని పై డాక్యుమెంట్ లో ఉంటుంది.

ఒకవేళ మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకొని, వినియోగదారుడు తర్వాతి స్లాబ్ లోకి వెళ్తే ఏం చేస్తారు?

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి వారు తమ వెబ్ సైట్ లో పెట్టిన ‘రిటైల్ సప్లై చార్జీల నిర్ణయము (ఆర్ధిక సంవత్సరం 2016-17)’ డాక్యుమెంట్ లో ఇలాంటి ప్రశ్నకే లైసెన్సీలు సమాధానమిస్తూ, ‘వినియోగదారుడి ప్రాతినిధ్యము మీద బిల్లులోని అధిక మొత్తం విత్-డ్రా చేయబడును. 30 లేదా 31 రోజుల వినియోగానికి గత రీడింగ్ తేది ఆధారంగా సిసి బిల్ల్స్ జారీ చేయబడును’ అని తెలిపారు. లైసెన్సీల సమాధానం పై కమిషన్ వారు తమ వైఖరి చెప్తూ  ‘కోరినచో బిల్లులను సరి చేయడమన్న లైసెన్సీల సమాధానము తగినదిగా లేదు. వినియోగదారుడు కోరకపోయినా –  ఎప్పుడైతే  లైసెన్సీ రీడింగ్ తీసుకోవడం ఆలస్యం చేస్తే ఆ బిల్లులు నెలవారి వినియోగానికి సర్దుబాటు చేయాలి’ అని అన్నారని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసినట్టు ‘దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ’ వారు ఇచ్చిన ‘2017-18’ రిపోర్ట్ లో చూడవచ్చు.

అంతే కాదు, విద్యుత్ అధికారులు తాజాగా ఇచ్చిన వివరణలో మీటర్ రీడింగ్ ఆలస్యం అవుతే, బిల్లును నెలరోజులకు సర్దుబాటు చేయకుండా, స్లాబ్ ను ఆలస్యం అయిన గడువుకు అనుగుణంగా మారుస్తామని చెప్పినట్టు ‘నమస్తే తెలంగాణ’ మరియు ‘వన్ ఇండియా’ ఆర్టికల్స్ లో చూడవచ్చు. కావున, లైసెన్సీలు మీటర్ రీడింగ్ ఆలస్యంగా చేస్తే స్లాబులు కూడా మారిపోతాయి.

ఒక వేల ఇంకా ఇటువంటి సమస్యలు ఏమైనా ఎదురైతే, వినియోగదారుడు ‘Consumer Grievances and Redressal Forum’ లో కంప్లైంట్ చేయవచ్చు. ఎటువంటి కంప్లైంట్ అయిన 45 రోజుల్లో (కొన్ని కేసుల్లో 15 రోజుల్లో) ఫోరం ఆర్డర్ పాస్ చేయాలని ఉన్నట్టుగా ‘TSERC (Establishment of Mechanism for Redressal of Grievances of the Consumers) Regulation,2015’ లో చూడవచ్చు.

చివరగా, మీటర్ రీడింగ్ ఆలస్యంగా తీసుకున్నా, ప్రజలపై అదనపు భారం పడదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll