Fake News, Telugu
 

చేగువేరా చిత్రపటం చెత్తకుప్పలో పడి ఉన్న ఫోటోని తీసింది స్పెయిన్ దేశంలో, క్యూబాలో కాదు

0

క్యూబా ప్రజలు చేగువేరా చిత్రపటాన్ని చెత్తకుప్పలో పడేసిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. క్యూబా దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత నేపథ్యంలో, ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: క్యూబా ప్రజలు చేగువేరా చిత్రపటాన్ని చెత్తకుప్పలో పడేసిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని 2020లో స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ నగరంలో తీసారు. ఈ ఫోటోని అలెజాండ్రో ఒలియా అనే ఫోటోగ్రాఫర్ తీసారు. ఈ ఫోటో క్యూబా దేశానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘LA RAZÓN’ న్యూస్ వెబ్సైటు 17 సెప్టెంబర్ 2020 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ నగరంలో తీసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. మాడ్రిడ్ నగరంలో ఒక స్ట్రీట్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు చేగువేరా చిత్రపటం చెత్తకుప్ప కంటైనర్లో పడేసినట్టు ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ ఫోటోని ‘LA RAZÓN’ న్యూస్ సంస్థ ఫోటోగ్రాఫర్‌ అలెజాండ్రో ఒలియా తీసినట్టు ఈ ఆర్టికల్‌లో క్రెడిట్ ఇచ్చారు.

‘AFP Factual’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ ఈ ఫోటోపై స్పష్టత కొరకు అలెజాండ్రో ఒలియాని సంప్రదించారు. అలెజాండ్రో ఒలియా, తను ఈ ఫోటోని 14 జూన్ 2020 నాడు మాడ్రిడ్ నగరంలోని స్ట్రీట్ కాస్టేలర్ లో తీసినట్టు AFP కి తెలిపారు. అలెజాండ్రో ఒలియా ఈ ఫోటోకి సంబంధించి ఇచ్చిన స్పష్టతను ‘AFP Factual’ వెబ్సైటు రిపోర్ట్ చేస్తూ ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

క్యూబా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో భాగంగా చేగువేరా చిత్రపటాన్ని క్యూబా ప్రజలు చెత్తకుప్పలో పడేశారని ఒక యూసర్ ఈ ఫోటోని ట్విటర్‌లో షేర్ చేసినప్పుడు, ఈ ఫోటో స్పెయిన్ దేశంలో తీసిన పాత ఫోటో అని CPI(M) పుదుచెర్రి అధికారిక ట్విట్టర్ హేండిల్ ట్వీట్ పెట్టింది. ఈ ఫోటో క్యూబా దేశంలో తీసినది కాదని వారు స్పష్టం చేసారు.

క్యూబా ప్రభుత్వం కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విఫలం అవడం, పౌర స్వేచ్ఛపై ఆంక్షలు, క్యూబా ఆర్థిక వ్యవస్థ పతనాన్ని నిరసిస్తూ వేలాది మంది నిరసనకారులు దేశ రాజధాని హవానాతో పాటు మరికొన్ని నగరాలలో ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనకి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, చేగువేరా చిత్రపటం చెత్తకుప్పలో పడి ఉన్న ఫోటోని స్పెయిన్ దేశంలో తీసారు, క్యూబాలో తీసినది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll