వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారు అని చెప్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). దీనికి మద్దతుగా బొత్స సత్యనారాయణ పేరు మీద ఉన్న రాజీనామా లేఖ ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వైసీపీకి ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారు.
ఫాక్ట్(నిజం): వైసీపీకి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయలేదు, ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా మీడియా సమావేశంలో తెలియజేసారు. అలాగే, ఇదే విషయాన్ని తెలియజేస్తూ వైసీపీ కూడా తమ అధికారిక X(ట్విట్టర్)లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆయన వైసీపీకి రాజీనామా చేయలేదని, ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్ అని తెలిసింది.
ఈ రాజీనామా లేఖ వైరల్ కాగా, ఈ లేఖ ఫేక్ అని చెప్తూ 13 మే 2024న వైసీపీ తమ అధికారిక X(ట్విట్టర్)లో మరియు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అలాగే పలు మీడియా సంస్థలు కూడా వైసీపీకి ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారని ఒక రాజీనామా లేఖ వైరల్ కాగా అది ఫేక్ అని వైసీపీ మరియు బొత్స సత్యనారయణ స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.(ఇక్కడ & ఇక్కడ)
అలాగే ఇటీవల ఒక మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు ఒక నకిలీ లేఖను సృష్టించి వైరల్ చేశారు అని టీడీపీ,కూటమిని విమర్శించారు.
అలాగే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించగా వైరల్ అవుతున్న ఈ రాజీనామా లేఖలోని సంతకం కూడా బొత్స సత్యనారాయణది కాదని తెలిసింది.
చివరగా, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేయలేదు, ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్.