Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి చట్టాన్ని చేయలేదు

0

ఇకపై ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ G.Oను జారీ చేసినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇకపై ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ G.Oను జారీ చేసారు.

ఫాక్ట్(నిజం):  ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి చట్టాన్ని చేయలేదు. ఐతే ఉత్తరప్రదేశ్‌లో మొదటినుండే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. 1955లో  రూపొందించిన The Uttar Pradesh Prohibition of Cow Slaughter Act ద్వారా రాష్ట్రంలో గోహత్యను పూర్తిగా నిషేధించారు. కాకపోతే ఈ చట్టంలో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2020లో ఒక అర్దినన్స్ (Uttar Pradesh Prevention of Cow Slaughter Amendment Ordinance, 2020) తీసుకొచ్చింది. గోహత్యకు పాల్పడిన వారికి గరిష్టంగా పది సంవత్సరాలు కఠిన జైలు శిక్ష విధించేలా ఈ అర్దినన్స్ ద్వారా మార్పులు చేసారు. 1955 చట్టంలో గానీ 2020 ఆర్దినన్స్‌లో గానీ ఎక్కడ కూడా గోహత్యకు పాల్పడితే ఉరి శిక్ష విధించే నియమం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్తున్న విషయానికి సంబంధించి ముందుగా మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. గోవును చంపితే ఉరిశిక్ష అనేది చట్ట పరమైన అంశం, కాబట్టి పోస్టులో చెప్తున్నట్టు ఒక G.O ద్వారా చట్టాల్లో మార్పులు చేయలేము.

సాధారణంగా చట్ట సభల్లో బిల్ పాస్ చేయడం ద్వారానో లేదా ఆర్డినెన్సు తీసుకురావడం ద్వారానో  చట్టాల్లో మార్పులు చేస్తారు. ఒకవేళ ఆర్డినెన్సు ద్వారా చట్టాల్లో మార్పులు చేసిన కూడా, నిర్ణీత కాలపరిదిలో ఈ ఆర్డినెన్సు చట్ట సభల్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది.

ఐతే ఇటీవల కాలంలో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ/చట్టాల్లో మార్పులు చేయలేదు.

The Uttar Pradesh Prohibition of Cow Slaughter Act, 1955:

ఉత్తరప్రదేశ్‌లో మొదటినుండే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. 1955లో  రూపొందించిన The Uttar Pradesh Prohibition of Cow Slaughter Act ద్వారా రాష్ట్రంలో గోహత్యను పూర్తిగా నిషేధించారు. ఇతర రాష్ట్రాలలో గోవులను వధించడానికి UP నుండి వాటిని తీసుకెళ్లడం కూడా నిషేధం. అలాగే రాష్ట్రంలో గోమాంసం తినడం, అమ్మడం కూడా నిషేధం. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం గోహత్య ఘటనల్లో గరిష్టంగా ఏడేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది.

ఐతే ఈ గోహత్యకు సంబంధించి కొన్ని మినహాయింపులు అందించారు. 15 సంవత్సరాల వయస్సు దాటి, పెంపకానికి/ వ్యవసాయ పనులకు పనికిరాని గోవులను, సంబంధించిన అధికారి నుండి సర్టిఫికేట్ (Fit for slaughter certificate) పొందిన తరవాత వధించోచ్చు.

Uttar Pradesh Prevention of Cow Slaughter Amendment Ordinance, 2020:

ఐతే 1955లో చేసిన చట్టానికి సవరణలు చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో ఒక ఆర్దినన్స్ తీసుకొచ్చింది. గోహత్యకు సంబంధించి శిక్షలను కఠినతరం చేస్తూ ఈ ఆర్దినన్స్ తీసుకొచ్చారు. గోహత్యకు పాల్పడిన వారికి గరిష్టంగా పది సంవత్సరాలు కఠిన జైలు శిక్ష విధించేలా ఈ అర్దినన్స్ ద్వారా మార్పులు చేసారు.

ఈ ఆర్దినన్స్‌కు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పైన చెప్పినట్టు 1955 చట్టంలో గానీ 2020 ఆర్దినన్స్‌లో గానీ ఎక్కడ కూడా గోహత్యకు పాల్పడితే ఉరి శిక్ష విధించే నియమం లేదు.

చివరగా, ఉత్తరప్రదేశ్‌లో గోవును చంపితే ఉరిశిక్ష విధించేలా యోగి ఆదిత్యనాథ్ ఎటువంటి చట్టాన్ని చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll