Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘భర్తకి కొరోనా వైరస్ వచ్చిందని తెలిసి భార్య తన పుట్టింటికి పారిపోయింది’ అనేది ఒక ఫేక్ వార్త

0

భర్తకి కొరోనా వైరస్ వచ్చిందని తెలిసి భార్య తన పుట్టింటికి పారిపోయింది అని ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భర్తకి కొరోనా వైరస్ వచ్చిందని తెలిసి భార్య తన పుట్టింటికి పారిపోయింది.

ఫాక్ట్ (నిజం): భార్య తన పుట్టింటికి వెళ్ళింది మార్చి 9 న, భర్త కు కొరోనా వైరస్ ఉన్నట్టు కచ్చితంగా తేలింది మార్చి 12 న. బెంగళూరు విమానాశ్రయం నుండే తను మార్చి 9న ఆగ్రా వెళ్ళిపోయింది, అసలు బెంగళూరు సిటీ లోకి రాలేదు. మీడియా లో ప్రచారం అవుతున్నట్టు తను పారిపోలేదని కర్ణాటక ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

ఆ పోస్టులోని ఇచ్చిన ఆర్టికల్ (ఆర్కైవ్డ్) లో ఆ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే, ‘ఇటీవలే పెళ్లి అయ్యి ఇటలీకి హనీమూన్ వెళ్లిన దంపతులకు కరోనా వైరస్ సోకింది. బెంగళూరు నగరంలోని గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిందని నిన్న తేలింది. దీంతో ఆ ఉద్యోగికి సమీపంలోని ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే భర్తకు కరోనా వైరస్ ఉంది అని తెలుసుకున్న ఆ ఉద్యోగి భార్య బెంగళూరు నుంచి పారిపోయి న్యూఢిల్లీకి విమానంలో ప్రయాణించి తన స్వస్థలమైన ఆగ్రా నగరానికి చేరుకుంది’ అని ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. ఇదే విషయాన్నీ పలు ప్రముఖ వర్తసంస్థలు [ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్), టైమ్స్ అఫ్ ఇండియా -తెలుగు (ఆర్కైవ్డ్), V6 వెలుగు (ఆర్కైవ్డ్) మరియు ap7am (ఆర్కైవ్డ్)] కూడా ప్రచురించాయి.

కానీ, “మార్చి 8న వాళ్లిద్దరూ ముంబై నుంచి బెంగళూరు వచ్చారు. అదే రోజు రాత్రి 1:50కు ఆమె విమానాశ్రయం నుంచి  బయల్దేరి మార్చి 9న ఢిల్లీ చేరుకుంది. అక్కడి నుంచి ఆగ్రా వెళ్లింది. ఆ తర్వాతి రోజు విధులకు హాజరైన భర్త అస్వస్థతకు గురికావడంతో… వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. 12 తేదీ నాటికి కరోనా తుది రిపోర్టులు వచ్చాయి. కాబట్టి ఆమె పారిపోయిందని చెప్పడం తప్పే అవుతుంది’’  అని కర్నాటక వైద్య విద్యా మంత్రి కే. సుధాకర్  తెలిపినట్టు ఆంధ్రజ్యోతి మరియు ap7am వారు వేరే ఆర్టికల్స్ తర్వాత ప్రచురించారు. అంతేకాదు, టైమ్స్ అఫ్ ఇండియా వారు కూడా ఇంగ్లిష్ ఆర్టికల్ (ఆర్కైవ్డ్) లో మొదట తను పారిపోయింది అని రాసినా, బెంగళూరు నుండి వెళ్లే సమయానికి తన భర్తకు కొరోనా వైరస్ ఉన్నట్టు భార్యకు తెలీదని ఆర్టికల్ ని అప్డేట్ చేసారు.

వారు అసలు హనీమూన్ కి ఇటలీ వెళ్ళలేదు, స్విట్జర్లాండ్ మరియు గ్రీస్ దేశాలకు వెళ్లారు. టైమ్స్ అఫ్ ఇండియా -తెలుగు (ఆర్కైవ్డ్) ఆర్టికల్ లో వారు ఇటలీ లోని గ్రీస్ కి వెళ్లినట్టు రాసారు, కానీ గ్రీస్ మరియు ఇటలీ వేరువేరు దేశాలు. గూగుల్ ఉద్యోగి ఎప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్తూ కర్ణాటక ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫ్లో-చార్ట్ ని కింద చూడవొచ్చు. ఈ కేసుకి  సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘భర్తకి కొరోనా వైరస్ వచ్చిందని తెలిసి భార్య తన పుట్టింటికి పారిపోయింది’ అనేది ఒక ఫేక్ వార్త.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll