Fake News, Telugu
 

ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు చెప్తూ ‘Way2News’ వార్తా కథనం ప్రచురించలేదు

0

“13 ఏప్రిల్ 2024న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయం సమాచారం అందిందని, వెంటనే విజయవాడ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు” అని ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని అంటూ ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో తెలిపినట్టుగా, ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందా? అని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం మాకు దొరకలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.

వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/35ea82)   ద్వారా ‘Way2News’లో వెతికితే “దర్యాప్తు అధికారులను మార్చాలి: పవన్ కళ్యాణ్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.

చివరగా, ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు చెప్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll