Fake News, Telugu
 

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో తేలిందని ‘Way2News’ కథనాన్ని ప్రచురించలేదు

0

రకుల్ ప్రీత్ వివాహానికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను ఫార్ములా -ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా హవాలా రూపంలో చెల్లించినట్టు విచారణలో తేలింది” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలింది అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.

ఫాక్ట్(నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 25 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. ఫార్ములా-ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ ఇప్పటి వరకు అనగా ఈ కథనాన్ని ప్రచురించే సమయం వరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలిందని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. పైగా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది.

ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/b7dehw) ద్వారా ‘Way2News’  వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ సంస్థ 13 డిసెంబర్ 2024న “అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త కథనం దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఈ వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.

అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 25 డిసెంబర్ 2024న Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది. అలాగే, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లోని వెబ్ లింక్‌తో వారు ప్రచురించిన అసలు వార్తను కూడా షేర్ చేశారు.

ఫార్ములా-ఈ (Formula-E) కార్ రేసింగ్ కేసు:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా-ఈ కార్ రేస్ ఫిబ్రవరి 2023లో నిర్వహించారు, 2024 లో కూడా ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించేందుకు గత ప్రభుత్వం అక్టోబర్ 2023లో ఫార్ములా-ఈ ఆపరేషన్స్(FEO)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ. 55 కోట్లను FEO కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని, ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని, విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేదని పేర్కొంటూ MA & UD ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌  ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2) తో పాటు ఐపిసి 409,120(B) సెక్షన్ల కింద 19 డిసెంబర్ 2024న ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని నమోదు చేసింది ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, రకుల్ ప్రీత్ సింగ్ వివాహానికి కేటీఆర్ ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా 10 కోట్లు హవాలా రూపంలో చెల్లించినట్టు విచారణలో తేలిందని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll