బీహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను, ఓట్ల రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్నారు. 17 ఆగస్టు 2025న ప్రారంభమైన ఈ యాత్ర బీహార్‌లోని దాదాపు 20 జిల్లాల్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు ప్రయాణించి, 2025 సెప్టెంబర్ 01న పాట్నాలో జరిగే ర్యాలీతో ముగియనుంది (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’కు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో జూలై 2025లో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా ఖమ్‌గావ్‌లో జరిగిన శ్రీ సంత్ గజానన్ మహారాజ్ పల్లకి ఊరేగింపుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియో 02 ఆగస్టు 2025న ‘divyavarhad_’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. “ఖామ్‌గావ్ నగరం నుండి షెగావ్ వైపు గజానన్ మహారాజ్ పల్లకీ బయలుదేరింది” ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు. ఈ వీడియో 17 ఆగస్టు 2025న ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున, ఈ వీడియోకు బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ బయోలో ఈ పేజీ మీడియా సంస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. అలాగే ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ పేజీకి సంబంధించిన యూట్యూబ్ లింక్ కూడా ఉన్నది. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో 31 జూలై 2025న వైరల్ వీడియోలోని దృశ్యాలను కలిగి ఉన్న అధిక నిడివి గల ఒక వీడియో అప్‌లోడ్ చేయబడిందని మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ‘లక్షలాది మంది భక్తులు పల్లకీతో కవాతు చేస్తారు, శ్రీవారి పల్లకీ ఇంటికి తిరిగి వస్తుంది.. ఖామ్‌గావ్ మరియు షెగావ్ మధ్య డ్రోన్ కెమెరా ద్వారా తీసిన పల్లకీ వీడియో’ అని పేర్కొన్నారు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో జూలై 2025లో మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని ఖమ్‌గావ్, షెగావ్ మధ్య జరిగిన శ్రీ సంత్ గజానన్ మహారాజ్ పల్లకి ఊరేగింపుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుందని తెలుస్తుంది. 30 జూలై 2025న ప్రచురించబడిన ‘ABP మాజా’ కథనం ప్రకారం, ఈ పల్లకి సేవ షెగావ్ నుండి మొదలై ఖామ్‌గావ్ వరకు వెళ్ళి తర్వాతి రోజు షెగావ్‌కు తిరిగి వస్తుంది.
చివరగా, ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ దృశ్యాలంటూ జూలై 2025లో మహారాష్ట్రలో జరిగిన శ్రీ సంత గజానన్ మహారాజ్ పల్లకి ఊరేగింపుకు సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు.