పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్లు, రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు సమిష్టిగా రైలును తరలించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒక వీడియోను ‘ఇది మోదీ హయాంలో భారతదేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం’ అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చెయ్యబడుతోంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పోలీసు సిబ్బంది, ఆర్మీ జవాన్లు, రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు సమిష్టిగా రైలును తరలించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ దృశ్యాలు 7 జూలై 2023న జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించినవి. ఈ ప్రమాదంలో హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఒక భాగం మంటల్లో చిక్కుకుని కొన్ని బోగీలు కాలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు, సైన్యం, ప్రయాణీకులు ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా నియంత్రించడానికి పక్కనే ఉన్న బోగీలను భౌతికంగా వేరు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, సంబంధిత అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన వాదన తప్పు.
ఈ వీడియోలో పోలీసులు, సైన్యం, ప్రయాణీకులు సమిష్టిగా రైలును తరలించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ, నిజానికి వీళ్లు ప్రయత్నిస్తున్నది రైలును భౌతికంగా స్టార్ట్ చేయడానికి కాదు, రైలు ప్రమాదం తర్వాత మంటలు చెలరేగిన ఇతర బోగీల నుండి కోచ్‌లను వేరు చేయడానికి.
ఈ వీడియో యొక్క కీ ఫ్రేమ్స్ ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇది కొన్ని మీడియా కథనాలకు దారి తీసింది. వీటి ద్వారా, ఈ దృశ్యాలు 07 జూలై 2023 తెల్లవారుజామున ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించినవి అని తెలుసుకున్నాం.

07జూలై 2023న, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఒక భాగంలో మంటలు చెలరేగాయి, దీనివల్ల కొన్ని కోచ్‌లు కాలిపోయాయి. ఈ మంటలు ఇతర కోచ్‌లకు వ్యాపించకుండా నిరోధించడానికి వెనుక కోచ్‌లను రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు వేరు చేశారు. పోస్ట్‌లో షేర్ చేయబడిన వైరల్ దృశ్యాలు పోలీసులు, సైన్యం, ప్రయాణీకులు చేసిన ఈ ప్రయత్నాలకు సంబంధించినవి. ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన వార్తా పత్రికలను ఇక్కడ, ఇక్కడ చదవవచ్చు.
అయితే, ఈ దృశ్యాలు వివిధ వాదనలతో సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి. ఈ వాదనలను రైల్వే ప్రతినిధి , దక్షిణ-మధ్య రైల్వే నిరాకరిస్తూ, మంటలు మరింత వ్యాపించకుండా ఉండటానికి రైల్వే సిబ్బంది & స్థానిక పోలీసులు వెనుక బోగీలను వేరు చేయడానికి ఉద్దేశపూర్వక నిర్ణయం తీసుకున్నట్లు ఈ దృశ్యాలు చూపిస్తున్నాయని స్పష్టం చేశారు.
చివరగా, ప్రమాదానికి గురైన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నుండి కోచ్‌లు వేరుచేస్తున్న దృశ్యాలను తప్పుదారి పట్టించే వాదనతో షేర్ చేస్తున్నారు.