Fake News, Telugu
 

డిసెంబర్ 2024లో కువైట్‌లో జరిగిన గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలో బాణసంచా కాల్చిన వీడియోను భారత్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన బాణసంచా ప్రదర్శనగా తప్పుగా షేర్ చేస్తున్నారు

0

09 మార్చి 2025న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారతదేశం 12 సంవత్సరాల తర్వాత ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో, ఓ స్టేడియంలో బాణసంచా పేలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). భారత క్రికెట్ జట్టు 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విజయం తర్వాత స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలు అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 09 మార్చి 2025న జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): వైరల్ వీడియో 21 డిసెంబర్ 2024న 26వ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలను చూపిస్తుంది. దీనికి 09 మార్చి 2025న న్యూజిలాండ్‌పై భారతదేశం సాధించిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయంతో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఉన్న పలు డిసెంబర్ 2024 సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ పోస్టుల్లో వీడియో కువైట్‌కు చెందినదని అని తెలిపారు. దీన్ని బట్టి ఈ వీడియోకు 09 మార్చి 2025న జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధం లేదని స్పష్టమవుతుంది.

ఈ క్లూస్‌ ఆధారంగా, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, Al Rai Media Group వెబ్‌సైట్‌లో “Fireworks Light Up Jaber Stadium at the Opening of Gulf Zain 26” అనే శీర్షికతో, వైరల్ వీడియోలోని స్టేడియం దృశ్యాలను పోలిన ఫోటోలను కలిగి ఉన్న ఒక వార్తా కథనం (ఆర్కైవ్ లింక్) లభించింది.  21 డిసెంబర్ 2024న Al Rai Media Group చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోనూ ఇదే దృశ్యాలు కనిపించాయి. ఈ పోస్ట్‌లో ఇది 26వ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించినదని పేర్కొన్నారు.

21 డిసెంబర్ 2024న కువైట్ న్యూస్ ఏజెన్సీ (KUNA) చేసిన X పోస్ట్‌లో, స్టేడియంలో బాణసంచా పేలుతున్న అదే ఫుటేజ్‌ను మేము కనుగొన్నాము. ఆ పోస్ట్‌లో “అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఓపెనింగ్ సెరెమనీలో కళాత్మక, వారసత్వ ప్రదర్శనలు” అని పేర్కొంది.

ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, అరేబియన్ గల్ఫ్ ఫుట్‌బాల్ కప్, “ఖలీజీ జైన్ 26”, 21 డిసెంబర్  2024న కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో గల్ఫ్ సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే కళాత్మక ప్రదర్శనలు నిర్వహించారు. గల్ఫ్ దేశాల టాప్ ఫుట్‌బాల్ టీమ్స్ పోటీపడే ఈ టోర్నమెంట్ స్పోర్ట్స్ టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు ప్రాంతీయ ఐక్యతను బలపరిచే లక్ష్యాన్ని ముందుంచుకుంది అని పేర్కొంది.

వైరల్ వీడియోలోని స్టేడియాన్ని కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలను గూగుల్ మ్యాప్స్‌లో  జియో లొకేట్ చేశాము. గూగుల్ మ్యాప్స్ ఇమేజెస్‌తో వైరల్ వీడియోలోని  దృశ్యాలను పోల్చినప్పుడు, ఈ స్థలం కువైట్‌కు చెందినదే అని నిర్ధారించాము. పోలికను క్రింద చూడవచ్చు.

చివరిగా, డిసెంబర్ 2024లో కువైట్‌లో జరిగిన గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలో బాణసంచా కాల్చిన వీడియోను భారత్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన బాణసంచా ప్రదర్శనగా తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll