ఆంధ్ర ప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కొందరు పూజారుల ఎదురుగా కూర్చొని తన జుట్టును సరి చేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. “…ఆక్షింతలు వేసినందుకు పూజారిని తిట్టి, దులిపేసుకున్నాడు..” అని ఈ వీడియో గురించి వివరణ ఇస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: తన తలపై అక్షింతలు వేశారని ఒక పూజారిని తిట్టి, వాటిని దులిపివేసుకొన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.
ఫాక్ట్(నిజం): ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు బహుకరించటానికి సీఎం జగన్ ఇటీవల తిరుమల దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు తన తలకి ఉన్న పాగాను తీసి జుట్టు సరిచేసుకొంటున్నప్పుడు తీసిన వీడియోను, పూజారి తన తలపై అక్షింతలు వేసినందుకు ఆయన్ని తిట్టి దులుపుకొన్నారు అని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు. కావున, ఈ క్లెయిమ్ తప్పు.
ముందుగా, సీఎం జగన్ పూజలో కూర్చున్న వీడియోల కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, వైరల్ వీడియో యొక్క పూర్తి వెర్షన్ దొరికింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా, పట్టు వస్త్రాలు బహుకరించటానికి సీఎం జగన్ తిరుమల దేవాలయాన్ని దర్శించినప్పటి వీడియో ఇది (ఇక్కడ).
వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఈ వీడియోలో 30:15 సెకన్ల మార్కు దగ్గర నుండి కనిపిస్తాయి. ఇక్కడ తను తల దులుపుకుంటున్నట్లు కనిపించినా, వీడియోని కొంచెం వెనక్కి చేసి చూస్తే, తన తలకి ఉన్న పాగాని ఒక పూజారి తీసిన తర్వాత జగన్ తన జుట్టును సరి చేసుకుంటారు అని అర్ధం అవుతుంది. ఆ తలపాగాను తీసేస్తున్న దృశ్యాల్ని తీసేసి, జుట్టు దులుపుకొంటున్న దృశ్యాలను మాత్రమే కట్ చేసి తప్పుడు కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
చివరిగా, సీఎం జగన్ తన తలపాగా తీసాక జుట్టు సరి చేసుకుంటున్న వీడియోని, పూజారి అక్షింతలు వేసినందుకు తనని తిట్టి తల దులుపుకున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.