Fake News, Telugu
 

పోలిష్ టీవీ సిరీస్‌లోని ఒక దృశ్యాన్ని, గోవాలో చర్చి ఫాదర్ సనాతన ధర్మానికి మారాడంటూ షేర్ చేస్తున్నారు

0

చర్చిలో ఒక ఫాదర్ నిలబడి ఉన్నట్లు చూపించే ఫోటో షేర్ చేస్తూ, గోవాలో కాథలిక్ జియోనిస్ట్ చర్చిలోని ‘ఫాదర్ ఆంథోనీ ఫెర్నాండెజ్’ కుటుంబం గత 4 దశాబ్దాల నుండి క్రైస్తవ మతానుయాయులు అని,  ఇపుడు అతడు తన మూల సనాతన ధర్మానికి వచ్చేశాడు అని, అందుకు కారణం, “సత్యంతో బ్రతకడానికి నాకు ఒక స్థలం కావాల్సి ఉండింది. అందుకే సనాతన ధర్మానికి తిరిగి వచ్చాను. రోజూ 24 నాలుగు గంటలూ అబద్ధాలు చెప్పి అలసిపోయాను” అన్నాడు అని పోస్టులో చెప్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: గోవాలో కాథలిక్ జియోనిస్ట్ చర్చిలోని ‘ఫాదర్ ఆంథోనీ ఫెర్నాండెజ్’ తన మూల సనాతన ధర్మానికి మారిపోయాడు.

ఫాక్ట్ (నిజం): ఇది 2000 సంవత్సరంలోని ‘ఫాదర్ మాథ్యూ’ అనే పోలిష్ టీవీ సిరీస్‌లోని ఒక సన్నివేశం. ఇందులో ఫాదర్ మాథ్యూ పాత్రలో నటించింది ఆర్తుర్ జ్మిజెవ్‌స్కీ. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చెయ్యగా, పోలాండ్‌లోని నిర్మాణ సంస్థ ATM గ్రూపా వెబ్‌సైట్‌లో ఈ చిత్రం లభించింది.

ఈ సిరీస్ గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ఫాదర్ మాథ్యూ’ అనే  పోలిష్ టీవీ సిరీస్‌లోని ఒక సన్నివేశం అని, ఇందులో ఉన్నది ఫాదర్ మాథ్యూ పాత్రలో నటించిన ఆర్తుర్ జ్మిజెవ్‌స్కీ అనే నటుడు అని తెలిసింది. ఈ సిరీస్ యొక్క ట్రైలర్ వెతకగా, ఇదే దృశ్యం ట్రైలర్లో కూడా ఉండటం గమనించవచ్చు.

చివరిగా, పోలిష్ టీవీ సిరీస్‌లోని ఒక దృశ్యాన్ని, గోవాలో చర్చి ఫాదర్ సనాతన ధర్మానికి మారాడంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll