Fake News, Telugu
 

రాజస్థాన్‌ హత్యకేసు నిందితులకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై నుండి పడి అమ్మాయి చనిపోయిన ఘటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

కొందరు యువకులు కాళ్లకు కట్టు కట్టుకుని నేలపై పాకుతున్న వీడియోను ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై వెళ్తున్న ఒక అమ్మాయి దుపట్టాను యువకులు లాగడంతో ఆమె కిందపడి చనిపోయిన ఘటనకు ముడిపెడుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ అమ్మాయి మరణానికి కారణమైన యువకులపై యోగి ప్రభుత్వం చర్య తీసుకుందని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి మరణానికి కారణమైన వ్యక్తులపై యోగి ప్రభుత్వం చర్య తీసుకున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఉత్తరప్రదేశ్‌లో సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి మరణానికి కారణమైన ముగ్గురు ముస్లిం యువకులు పారిపోయే క్రమంలో పోలీసులు వీరిపై కాల్పులు జరిపిన ఘటన నిజమైనప్పటికీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఈ ఘటనకు సంబంధించింది కాదు. ఈ వీడియో రాజస్థాన్‌లో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించింది.   కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సైకిల్‌పై వెళ్తున్న అమ్మాయి దుపట్టా లాగడంతో ఆ అమ్మాయి కిందపడిపోయి, వెనకనుండి వస్తున్న  మోటార్‌సైకిల్‌ ఢీకొట్టడంతో చనిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ముస్లిం యువకులను నిందితులుగా పోలీసులు గుర్తించారు (ఇక్కడ & ఇక్కడ).

కాగా వైద్యపరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ నిందితులను పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వీరిపై కాల్పులు జరిపినట్టు వార్తా కథనాలు తెలిపాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఈ ఘటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

కానీ, ఈ వీడియోకు పైన తెలిపిన ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ దృశ్యాలను రాజస్థాన్‌లో జరిగిన హత్యకేసుకు ముడిపెడుతూ రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం వీడియోలో కనిపిస్తున్న తేజ్వీర్, యువరాజ్ మరియు బంటీ ఖుషాల్ అనే ముగ్గురు యువకులు రాజస్థాన్‌లో ఒక హత్య కేసు నిందితులు. వీరిని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులలో వీరు గాయపడ్డారు. దీన్నిబట్టి వైరల్ పోస్టులో చెప్తున్న నిజమే అయినప్పటికి, ఆ వీడియో మాత్రం ఆ ఘటనకు సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

చివరగా, రాజస్థాన్‌లో జరిగిన హత్యకేసు నిందితులకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్‌లో దుపట్టా లాగడంతో సైకిల్‌పై నుండి పడి అమ్మాయి చనిపోయిన ఘటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll