Fake News, Telugu
 

ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమి మాదే అని వక్ఫ్ బోర్డు దావా వేయలేదు, ఇది ఫేక్ వార్త

0

ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం భూమిపై వక్ఫ్ బోర్డు దావా వేసిందని, ఆ భూమి మాదే అని చెప్పిందని ఒక పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమి మాదే – వక్ఫ్ బోర్డు

ఫాక్ట్(నిజం): ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమిపై వక్ఫ్ బోర్డు దావా వేసిందని చెప్తున్న దాంట్లో నిజం లేదు, ఇది ఫేక్ వార్త. ఆలయ కోశాధికారి పవన్ కుమార్ త్రిపాఠి, కార్యనిర్వాహక అధికారి వీణా పాటిల్ ఆ దావాను ఖండించారు. అదనంగా, మరాఠీ దినపత్రిక సకల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమకు ఆపాదించబడిన గ్రాఫిక్ నకిలీదని, వారు అలాంటి కథనం ప్రచురించలేదు అని స్పష్టం చేశారు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు .

దావాను ధృవీకరించడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా మాకు, ఎలాంటి వార్తా కథనాలు లేదా అధికారిక పత్రాలు లభించలేదు.

గూగుల్‌ కీవర్డ్స్ ఉపయోగించి శోధించగా, X ప్లాట్ఫామ్ లో 18 నవంబర్ 2024న ఒక పోస్ట్‌ లభించింది  (ఆర్కైవ్ లింక్). అందులో సిద్ధివినాయక్ ఆలయ కోశాధికారి పవన్ కుమార్ త్రిపాఠి ఉన్న వీడియో ఉంది. ఆయన ఆ వీడియోలో ఆలయంపై ఎలాంటి బోర్డు క్లెయిమ్ చేయలేదని, అది హిందువులకు చెందినదని, వారి యాజమాన్యంలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మేము పవన్ కుమార్ త్రిపాఠిని సంప్రదించిన్నప్పుడు, ఆయన సోషల్ మీడియాలో వైరల్ అయిన దావా తప్పు అని, తమకు ఎటువంటి అధికారిక నోటీసు రాలేదని తెలిపారు. అలాగే, ఆలయ కార్యనిర్వాహక అధికారి వీణా పాటిల్‌ను కూడా సంప్రదించాము, వారు కూడా పవన్ కుమార్ త్రిపాఠి దావాను ఖండించిన వీడియోను మాతో షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో చేస్తున్న దావా తప్పు అని స్పష్టం చేశారు.

మా పరిశోధనలో, మరాఠీ దినపత్రిక సకల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను కనుగొన్నాము (ఆర్కైవ్ లింక్). అక్కడ వారు తమకు ఆపాదించబడిన గ్రాఫిక్ నకిలీదని, అలాగే సిద్ధివినాయక దేవాలయం యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తూ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎటువంటి కథనం తాము ప్రచురించలేదని స్పష్టం చేశారు.

వైరల్ పోస్ట్‌లో క్రియేట్లీ.ఇన్, క్రియేట్లీ మీడియా వాటర్ మర్క్స్ మేము గమనించాము . సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను శోధించగా, ఈ పేజీలు తరచుగా ఆధారాలు లేని దావాలు పోస్ట్ చేస్తాయని మేము కనుగొన్నాము. క్రియేట్లీ ఇంకా మూడు ఇతర గ్రాఫిక్స్‌ని కూడా పోస్ట్ చేసింది, వాటిలో వక్ఫ్ బోర్డు గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, మరియు పూణె మునిసిపల్ కార్పొరేషన్ భూమి పై యాజమాన్యాన్ని క్లెయిమ్ చేశాయని పేర్కొంది. ఈ గ్రాఫిక్స్ కి ఎలాంటి సోర్స్ పేర్కొనలేదు, లేదా అవి వ్యంగ్యం అని సూచించలేదు.

ఈ దావాను గురుంచి పరిశోధన చేస్తున్నప్పుడు, 19 నవంబర్ 2024న X ప్లాట్ఫామ్ లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే (UBT) వారి పోస్టు కనుగొన్నాము (ఆర్కైవ్ లింక్), ఇది వైరల్ వాదనలు నకిలీవని స్పష్టం చేసింది. నకిలీ వార్తల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ఆ X పోస్ట్‌లో కోరారు.

చివరిగా, ముంబైలోని సిద్ధివినాయక్ దేవాలయం ఉన్న భూమి మాదే అని వక్ఫ్ బోర్డు దావా వేయలేదు, ఇది ఫేక్ వార్త.

Share.

About Author

Comments are closed.

scroll