“భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్న ఆస్తుల మొత్తంవిస్తీర్ణం పాకిస్తాన్ మొత్తం వైశాల్యం కంటే ఎక్కువ, భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల ఆస్తుల విస్తీర్ణం 9.40 లక్షల చదరపు కిలోమీటర్లు (చ.కి.మీ) కాగా పాకిస్థాన్ మొత్తం వైశాల్యం 8.81 లక్షల చ.కి.మీ” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలో వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్న ఆస్తుల మొత్తం విస్తీర్ణం (9.40 లక్షల చ.కి.మీ) పాకిస్థాన్ మొత్తం వైశాల్యం (8.81 లక్షల చ.కి.మీ) కంటే ఎక్కువ.
ఫాక్ట్(నిజం): భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, భారతదేశంలో వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి 9.4 లక్షల ఎకరాలు, వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నట్లుగా 9.40 లక్షల చదరపు కిలోమీటర్లు కాదు. 9.4 లక్షల ఎకరాలు సుమారు 3,804 చదరపు కిలోమీటర్లకు సమానం. ఇది పాకిస్థాన్ మొత్తం వైశాల్యం కంటే చాలా తక్కువ. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్న ఆస్తుల గురించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 13 సెప్టెంబర్ 2024న భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన Explainer on Waqf Amendment Bill 2024 (ఆర్కైవ్డ్ లింక్) అనే వక్ఫ్ సవరణ బిల్లు 2024పై రాసిన వివరణ లభించింది. ఈ వివరణలోని, FAQ సెక్షన్ 6లో, “భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ప్రస్తుతం 8.7 లక్షల ఆస్తులను ఉన్నాయని, ఇవీ 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి, ఈ ఆస్తుల విలువ సుమారు 1.2 లక్షల కోట్లు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ హోల్డింగ్‌లను (ఆస్తులు) కలిగి ఉంది మరియు భారతదేశంలో ఆర్మీ, భారతీయ రైల్వేల తర్వాత వక్ఫ్ బోర్డు అతిపెద్ద భూ యజమాని” అని పేర్కొనబడింది.

ఈ క్రమంలోనే, 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7 లక్షల ఆస్తులను వక్ఫ్ బోర్డులు నియంత్రిస్తున్నాయని పేర్కొన్న పలు వార్తా కథనాలు కూడా మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ). ఈ సమాచారం ఆధారంగా, వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నట్లుగా భారతదేశంలో వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి 9.40 లక్షల చ.కి.మీ కాదని, 9.4 లక్షల ఎకరాలు అని స్పష్టమవుతుంది.

తదుపరి, మేము 9.4 లక్షల ఎకరాలను చదరపు కిలోమీటర్ల లోకి మార్చగా, 9.4 లక్షల ఎకరాలు దాదాపు 3,804 చదరపు కిలోమీటర్లకు సమానం అని కనుగొన్నాము.

లాస్ ఏంజిల్స్‌లోని పాకిస్తాన్ కాన్సులేట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో, పాకిస్తాన్ భూభాగం యొక్క మొత్తం వైశాల్యం సుమారు 8,81,913 చదరపు కిలోమీటర్లు అని పేర్కొన్నారు. స్వీడన్‌లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, పాకిస్తాన్ మొత్తం 7,96,095 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత భూభాగంలో కొంత భాగాన్ని పాకిస్తాన్ తనది అని క్లెయిమ్ చేస్తున్నందున, పాకిస్తాన్ వైశాల్యం ఎంత అని ఖచ్చితంగా చెప్పలేము. అయితే, పాకిస్తాన్ మొత్తం వైశాల్యం భారతదేశంలోని వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి కంటే చాలా ఎక్కువ అని మనం నిర్ధారించవచ్చు.

08 ఆగస్టు 2024న, వక్ఫ్ బోర్డు పనితీరును క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ యొక్క సమర్థ నిర్వహణ లక్ష్యంతో లోక్‌సభలో Waqf (Amendment) Bill, 2024, and the Mussalman Waqf (Repeal) Bill, 2024, అనే రెండు బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయి. పార్లమెంటులో ఈ బిల్లులపై విస్తృత చర్చ జరిగిన తర్వాత, ఈ బిల్లులను అధ్యయనం మరియు సిఫార్సుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపారు (ఇక్కడ, ఇక్కడ). వక్ఫ్ బిల్లులపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, భారతదేశంలో వక్ఫ్ బోర్డుల నియంత్రణలో ఉన్న ఆస్తుల విస్తీర్ణం 9.4 లక్షల ఎకరాలు, ఇది దాదాపు 3,804 చదరపు కిలోమీటర్లకు సమానం. ఇది పాకిస్తాన్ మొత్తం వైశాల్యం కంటే చాలా తక్కువ.