Fake News, Telugu
 

రైలు ప్రయణికులకి అత్యవసర పరిస్థితుల్లో మందులు సరఫరా చేసే సేవలని విజయ్ మెహతా నిలిపివేశారు

0

రైలు ప్రయణికులకి అత్యవసర పరిస్థితుల్లో మందులు సరఫరా చేస్తున్న విజయ్ మెహతా, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ప్రాణాపాయం నుండి కాపాడే మందులని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకి అందచేయడమే లక్ష్యంగా విజయ్ మెహతా పనిచేస్తునట్టు పోస్టులో తెలిపారు. మందుల కోసం విజయ్ మెహతా ఫోన్ కి కాల్ చేస్తే, తరువాత వచ్చే స్టేషన్ లో వాటిని సముకురుస్తాడని ఈ పోస్టులో తెలిపారు. అంతేకాదు, దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: రైలు ప్రయణికులకి అత్యవసర పరిస్థితుల్లో మందులు సరఫరా చేస్తున్న విజయ్ మెహతా.

ఫాక్ట్ (నిజం): విజయ్ మెహతా అనే ముంబై కి చెందిన రైల్వే ఫుడ్ సప్లయర్, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకి ప్రత్యేక రుసుము లేకుండా మందులు అందచేసేవారు. కాని, విజయ్ మెహతా ఆ సేవలని ఇప్పుడు నిలిపివేసారు. తన సేవల గురించి కొందరు షేర్ చేసిన పోస్టులు వాట్సప్ లో వైరల్ అవ్వడంతో, చిన్నపాటి మందుల కోసం కొన్ని వందల మంది రోజు విజయ్ మెహతా కి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వలేక విజయ్ మెహతా, తన సేవలని నిలిపేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, విజయ్ మెహతా కు సంబంధించిన వివరాలను తెలుపుతూ ‘The Indian Express’  2017 లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. విజయ్ మెహతా అనే ముంబై కి చెందిన రైల్వే ఫుడ్ సప్లయర్, అత్యవసర పరిస్థితిలో ప్రయాణికులకి ఎలాంటి ప్రత్యేక రుసుము తీసుకోకుండా మందులు అందించేవారని ఈ ఆర్టికల్ తెలిపింది. అయితే, తన సేవల గురించి తెలుపుతూ షేర్ చేసిన మెసేజ్ లు వాట్సాప్ లో  వైరల్ అవ్వడంతో, చిన్నపాటి మందుల కోసం  కొన్ని వందల మంది రోజు విజయ్ మెహతా కి ఫోన్ చేయడం మొదలుపెట్టినట్టు ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వలేక విజయ్ మెహతా, తన సేవలని నిలిపేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

పోస్టులో షేర్ చేసిన విజయ్ మెహతా మొబైల్ నెంబర్ ఇప్పుడు వాడకంలో లేదు. అలాగే, పోస్టులో కనిపిస్తున్న వ్యక్తి విజయ్ మెహతా కాదు. విజయ్ మెహతా తన సేవలని నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ‘Navabharat Times’ 2017లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అది ఇక్కడ చూడవచ్చు.

రైలు ప్రయాణాలలో అత్యవసర వైద్యం లేదా మందుల కొరకు తమ రైలులోని TTE లేదా, రైల్వే లో పనిచేస్తున్న  స్టాఫ్ మెంబెర్ కి సమాచారం ఇస్తే, వారు కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇస్తారు. మీ రైలు వెళ్ళే తరువాతి స్టేషన్ లో మీకు కావలిసిన వైద్య సదుపాయాలు, మందులని రైల్వే సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. మెడికల్ ఎమర్జెన్సీ కొరకు ప్రయాణికులు 138 నెంబర్ కి కాల్ చేసి సంప్రదిస్తే రైల్వే సిబ్బంది వెంటనే స్పందిస్తారు.

చివరగా, రైలు ప్రయణికులకి అత్యవసర పరిస్థితుల్లో మందులు అందించే సేవలని విజయ్ మెహతా నిలిపివేశారు.

Share.

About Author

Comments are closed.

scroll