“ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది ముస్లిం యువకులు కత్తులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, అక్కడి ప్రభుత్వ యంత్రాగాన్ని బూతులు తిడుతూ బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన మరుసటి రోజే యూపీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారితో క్షమాపణలు చెప్పి ఇస్తూ వీధుల్లో ఊరేగించారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది ముస్లిం యువకులు కత్తులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, దుర్భాషలాడుతూ వీడియో విడుదల చేసిన మరుసటి రోజే యూపీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారితో క్షమాపణలు చెప్పించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించింది కాదు. ఈ ఘటన 31 డిసెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగింది. ఈ ఘటనలో నిందుతులు హిందూ మతానికి చెందిన వారు. ఈ ఘటనకు సంబంధించిన FIR మరియు వార్తాకథనాల ప్రకారం, ఈ ఘటనలో నిందుతులు ఆకాష్ గజ్బీ, ఉదయ్ సారథే, ఆకాష్ సోని, నితేష్ జాట్, లక్కీ సేన్, జై రావత్, హృతిక్ వాల్మీకి అని తెలిసింది. అలాగే, ఈ ఘటనలో నిందితులలో ఎవరూ ముస్లిం వర్గానికి చెందినవారు కాదని, ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని అని టిటి నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, వైరల్ వీడియోలో చూపిస్తున్న సంఘటన 31 డిసెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగింది. భోపాల్‌లో గజినీ అనే గూండా తన సహచరులతో కలిసి ఓ వ్యక్తిని దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, గజినీతో పాటు అతని సహచరులను భోపాల్ టిటి నగర్ పోలీసులు అరెస్టు చేసి వారితో క్షమాపణలు చెప్పి ఇస్తూ రోడ్లపై ఊరేగించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడబోమని, ఇలాంటి వీడియోలను చేయమని నిందుతులు ఈ ఊరేగింపు సమయంలో ప్రతిజ్ఞ చేశారు. అరెస్టయిన వ్యక్తుల పేర్లు ఆకాష్ గజ్బీ, ఉదయ్ సారథే, ఆకాష్ సోని, నితేష్ జాట్, లక్కీ సేన్, జై రావత్ మరియు హృతిక్ వాల్మీకి అని ఈ కథనాలు పేర్కొన్నాయి.
మేము ఈ ఘటనలో నమోదైన FIR కాపీని కూడా పరిశీలించాము,FIR ప్రకారం, భోపాల్ నగరంలోని టిటి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, 31 డిసెంబర్ 2024న తెల్లవారుజామున 02.00 గంటలకు, రతన్ ఠాకూర్ అనే వ్యక్తి తన ఇంటి దగ్గర స్థలం లేకపోవడంతో సమీపంలోని సాయి దేవాలయం దగ్గర తన స్కార్పియో కారును పార్క్ చేశాడు. అక్కడ పార్కింగ్ చేయడానికి ₹5000 నిందితులు డిమాండ్ చేశారు. దీనికి ఫిర్యాదుదారుడైన రతన్ ఠాకూర్ నిరాకరించడంతో, అతన్ని అసభ్యంగా తిట్టి, బెదిరించి, రాళ్లతో అతని వాహనం యొక్క అద్దాన్ని పగలగొట్టారు. FIRలో కూడా నిందితుల పేర్లు ఆకాష్ గజ్బీ, ఉదయ్ సారథే, ఆకాష్ సోని, నితేష్ జాట్, లక్కీ సేన్, జై రావత్, హృతిక్ వాల్మీకి అని పేర్కొన్నారు.
టిటి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుధీర్ అర్జారియా ఈ ఘటనను గురించి మీడియాతో మాట్లాడుతున్న వీడియోను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
తదుపరి మేము ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం టిటి నగర్ పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించాము, వారు మాతో మాట్లాడుతూ ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని, నిందితులలో ఎవరూ ముస్లిం వర్గానికి చెందినవారు కాదని స్పష్టం చేశారు.
చివరగా, ఈ వైరల్ వీడియోలో చూపిస్తున్న సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగింది. అలాగే ఈ ఘటనలో నిందుతులు హిందూ మతానికి చెందిన వారు.