Fake News, Telugu
 

ముంబైలోని విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ బంగ్లాను డెట్ రికవరీ ట్రిబ్యునల్ 2021 ఆగస్టులో 52.25 కోట్లకు విక్రయించింది

0

ముంబైలోని విజయ్ మాల్యా బంగ్లాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేలం వేయబోతుందని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. 35,000 స్క్వేర్ ఫీట్ల ఏరియా కలిగిన ఈ బంగ్లాకు SBI ప్రారంభ ధర 450 కోట్లు అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వేలం వేయబోతున్న ముంబైలోని విజయ్ మాల్యా బంగ్లా యొక్క చిత్రం.

ఫాక్ట్ (నిజం):  విజయ్ మాల్యాకు చెందిన ముంబైలోని కింగ్‌ఫిషర్ బంగ్లాను బెంగుళూరులోని రుణ వసూలు ట్రిబ్యునల్ (DRT) 2021 ఆగస్టు నెలలోనే విక్రయించింది. హైదరాబాద్‌కు చెందిన సాటర్న్ రియల్టర్స్ సంస్థ కింగ్‌ఫిషర్ హౌస్‌ను 52.25 కోట్లకు కొనుగోలు చేసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ భవనం. ఈ భవన నిర్మాణంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL) సంస్థకు 55 శాతం, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 45 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. ఈ భవనంలో విజయ్ మాల్యాకు చెందిన 39 ఫ్లాట్లు మరియు పెంట్ హౌస్‌ను మాత్రమే SBI నేతృత్వంలోని కన్సార్టియం విక్రయించగలదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకొని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యకు చెందిన 6,203.35 కోట్ల విలువ గల ఆస్తులను SBI నేతృత్వంలోని కన్సార్టియం విక్రయించడానికి  బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) 2017 జనవరి నెలలో ఆమోదం తెలిపింది. 2013లో SBI నేతృత్వంలోని కన్సార్టియం క్లెయిమ్ చేసిన 6,203.35 కోట్ల రుణాలను, 11.5% వార్షిక వడ్డీ రేటుతో మొత్తాన్ని తిరిగి పొందే ప్రక్రియను ప్రారంభించాలని DRT ఈ ఆర్డర్లో తెలిపింది. దీనిలో భాగంగా విజయ్ మాల్యాకు సంబంధించిన కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ మరియు యునైటెడ్ బ్రువెరీస్ లిమిటెడ్ షేర్లని, విజయ్ మాల్యాకు చెందిన భవనాలని, ఫ్లాట్లని జప్తు చేయడానికి DRT ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని కర్ణాటక హైకోర్టు 2017 ఫిబ్రవరి నెలలో ఇచ్చిన జడ్జిమెంట్లో తెలిపింది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి ఇంటర్నెట్లో వెతికితే, ముంబైలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ బంగ్లాను బెంగళూరు రుణ వసూలు ట్రిబ్యునల్ 2021 ఆగస్టు నెలలోనే వేలం వేసి అమ్మేసినట్టు తెలిసింది. ‘కింగ్‌ఫిషర్ హౌస్‌’ విక్రయానికి సంబంధించి DRT 2020 సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసిన ప్రకటనని ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రకటనలో కింగ్‌ఫిషర్ హౌస్‌ను 65.2 కోట్ల రిజర్వ్ ధర కంటే తక్కువ విక్రయించబడదని తెలిపారు. అయితే, ఈ ఆస్తి విక్రయానికి సంబంధించి 2016 నుంచి వేలం వేస్తూ, ఎనిమిది సార్లు విఫలమయ్యి, తొమ్మిదోసారి 2021 ఆగస్టు నెలలో 52.25 కోట్లకు కొనుగోలయినట్టు తెలిసింది.

SBI కన్సార్టియం తరుపున DRT ఈ ఆస్తిని వేలం వేసి అమ్మినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన సాటర్న్ రియల్టర్స్ అనే సంస్థ, కింగ్‌ఫిషర్ హౌస్‌ను 52.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2021 ఆగస్టు నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ  చూడవచ్చు.

ఇకపోతే, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులోని కింగ్‌ఫిషర్ టవర్స్  భవనం. ఈ భవన నిర్మాణంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL) సంస్థకు 55 శాతం, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 45 శాతం వాటాలు కలిగి ఉన్నట్టు తెలిసింది. విజయ్ మాల్యా మనీ లాండరింగ్  కేసుకి సంబంధించి 2016 సెప్టెంబర్ నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన విజయ్ మాల్యా ఆస్తుల వివరాలలో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా జత చేసినట్టు తెలిసింది. ఈ భవనంలో విజయ్ మాల్యాకు చెందిన 39 ఫ్లాట్లు మరియు విజయ్ మాల్యా కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాన్షన్ స్టైల్‌ పెంట్ హౌస్‌ను మాత్రమే DRT అమ్మగలదు. కింగ్‌ఫిషర్ టవర్లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు 42 ఫ్లాట్లపై యాజమానత్వం కలిగి ఉంది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంస్థ ఇటీవల కింగ్‌ఫిషర్ టవర్లోని ఒక ఫ్లాట్‌ని 35 కోట్లకి విక్రయించింది

చివరగా, ముంబైలో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ బంగ్లాను బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ 2021 ఆగస్టు నెలలోనే అమ్మేసింది.

Share.

About Author

Comments are closed.

scroll