Fake News, Telugu
 

వరద బాధితులకి తేజస్వి యాదవ్ డబ్బులు పంచుతున్న వీడియోని బీహార్ ఎన్నికలకు ముడి పెడుతున్నారు

0

బీహార్ లో బహిరంగంగా డబ్బులు పంచుతున్న రాష్ట్రీయ జనతా దళ్ (RJD) లీడర్ తేజస్వి యాదవ్, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత బహిరంగంగా డబ్బులు పంచుతున్నా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, అంటూ ఈ పోస్టుకి కొందరు రిప్లై ఇవ్వడం మనం చూడవచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగబోతున్న నేపధ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్ ఎన్నికల కోసం RJD లీడర్ తేజస్వి యాదవ్ బహిరంగంగా డబ్బులు పంచుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. జూలై 2020లో తేజస్వి యాదవ్ బీహార్ లోని భాగల్పూర్ ప్రాంతంలో వరద బాధితులని పరామర్షించడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది అని విశ్లేషణలో తెలిసింది. ఆశ్రయం కోల్పోయిన వరద బాధితులకి తేజస్వి యాదవ్ కావాల్సిన ఆహరం అలాగే, డబ్బులు పంచారు. వీడియోలో తేజస్వి యాదవ్ డబ్బులు పంచుతున్నది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్ట్ దొరికింది. ఈ వీడియోని ‘31 జూలై 2020’ నాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంటే, బీహార్ ఎన్నికల షెడ్యుల్ రాకముందే ఈ వీడియో ఇంటర్నెట్ లో షేర్ అయినట్టు ఈ వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

‘బీహార్ లో వరద బాధితుల్ని కలుసుకున్న రాష్ట్రీయ జనతా దళ్ (RJD) లీడర్ తేజస్వి యాదవ్’, అని ఆ యూసర్ ఈ పోస్టులో తెలిపారు. ఈ లైవ్ వీడియో బీహార్ లోని భాగల్పూర్ నగరంలో తీసినట్టు అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెతికితే, RJD లీడర్ తేజస్వి యాదవ్ భాగల్పూర్ నగరంలోని వరద భాదితులను పరమార్షిస్తున్న వీడియో అంటూ ‘NavBharat Times’ న్యూస్ వెబ్ సైట్ ‘31 జూలై 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఆర్టికల్ లోని వీడియోలో తేజస్వి యాదవ్ వరద బాధితులకి డబ్బులు పంచుతున్న దృశ్యాలు చూడవచ్చు.

అంతేకాదు, తేజస్వి యాదవ్ బీహార్ లోని మధుబని ప్రాంతంలో మరియు చాప్రా ప్రాంతంలో చిక్కుకున్న వరద బాధితులకి కూడా డబ్బులు పంచిన దృశ్యాలు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. దీనిబట్టి పోస్టులోని వీడియోలో తేజస్వి యాదవ్ డబ్బులు పంచుతున్నది వోటర్లకి కాదు, వరద బాధితులకని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, తేజస్వి యాదవ్ వరద బాధితులకి డబ్బులు పంచుతున్న పాత వీడియోని చూపిస్తూ బీహార్ ఎన్నికల కోసం వోటర్లకి బహిరంగంగా డబ్బులు పంచుతున్న తేజస్వి యాదవ్ అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll