Fake News, Telugu
 

మౌలానా అర్షద్ మదానీ బంగ్లాదేశ్ పర్యటనలో హెలికాప్టర్‌ ప్రయాణ వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మౌలానా సజ్జాద్ నోమాని అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) చాలా ఎక్కువగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఇస్లామిక్ టోపీలు ధరించిన కొంతమంది హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మౌలానా సజ్జద్ నోమానీ అని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అని పోస్టులో షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్, శరద్ పవార్, మరియు ఉద్ధవ్ ఠాకరే అతనికి 2024 మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారం కోసం హెలికాప్టర్ అందించారని, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మహా వికాస్ అఘాడీ చెయ్యాల్సిన వాటి గురుంచి అతను అనేక డిమాండ్లు చేశాడని చెప్తూ ఈ పోస్ట్ ఇటీవల జరిగిన 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షేర్ చేస్తున్నారు . ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి అందించిన హెలికాప్టర్‌ను మౌలానా సజ్జాద్ నోమానీ ఉపయోగించారు, దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ఉన్నది మౌలానా సజ్జాద్ నోమానీ కాదు, జమియత్ ఉలామా హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ. ఈ వీడియో మౌలానా అర్షద్ మదానీ ఇటీవల చేసిన బంగ్లాదేశ్ పర్యటనలోది. అంతే కాదు, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి మౌలానా సజ్జాద్ నోమానీకి హెలికాప్టర్‌ను ఇచ్చినట్టు చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లభించలేదు. అదనంగా, 19 నవంబర్ 2024న మౌలానా సజ్జద్ నోమానీ X పోస్ట్ ద్వారా తన మద్దతుకు బదులుగా మహా వికాస్ అఘాడీ (MVA)కు ఏ డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు,18 నవంబర్ 2024న జమియాత్ ఉలామా-ఎ-హింద్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అదే వీడియోకు (ఆర్కైవ్) దారితీసింది. పోస్ట్ శీర్షిక ప్రకారం, ఆ వ్యక్తి మౌలానా సజ్జాద్ నోమానీ కాదు, జమియాత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ.

ఫేస్బుక్ పోస్ట్  యొక్క వివరణ నుండి క్లూలను తీసుకొని, వెతికితే ఈ సంఘటనను వివరించే మరిన్ని ఆధారాలు లభించాయి. OurIslam24 (ఆర్కైవ్) ద్వారా ప్రచురించబడిన వార్త కథనం ప్రకారం, సయ్యద్ అర్షద్ మదానీ 15 నవంబర్ 2024 నుంచి 21 నవంబర్ 2024 వరకు బంగ్లాదేశ్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన వివిధ జిల్లాలలో జరిగిన ఇస్లామిక్ సమావేశాలు, ఇస్లాహీ బయాన్, మరియు బాయత్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ సిస్టం, కౌమీ మదరసాలు, ప్రొఫెట్ బోధనలు, మరియు స్వయం-అభివృద్ధి వంటి అంశాల మీద జరిగాయి.

అలాగే , 17 నవంబర్ 2024న మౌలానా అర్షద్ మదానీ తన బంగ్లాదేశ్ పర్యటన నుండి చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ను (ఆర్కైవ్) కనుగొన్నాము .

ఇకపోతే, మహా వికాస్ అఘాడీ ద్వారా మౌలానా సజ్జాద్ నోమానీకి హెలికాప్టర్ అందించబడినట్లు, ఆయన అనేక డిమాండ్లను చేసినట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఒకవేళ ఆయన నిజంగా ఇలాంటి డిమాండ్లు చేసినట్లైతే, మీడియా వాటి గురుంచి ప్రచురించేది. మౌలానా సజ్జాద్ నోమానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ ) కూడా పరిశీలించాము, కానీ ఆయన అలాంటి డిమాండ్లను చేసినట్టు సూచించే పోస్టులేవీ మాకు లభించలేదు.

ఈ శోధన సమయంలో, 19 నవంబర్ 2024న మౌలానా సజ్జాద్ నోమాని X ప్లాట్ఫామ్ లో చేసిన పోస్ట్ను (ఆర్కైవ్) కూడా మేము కనుగొన్నాము, ఇందులో ఆయన తన మద్దతుకు బదులుగా మహా వికాస్ అఘాడీకి (MVA) ఎటువంటి డిమాండ్లు చేయలేదని స్పష్టం చేశారు.

చివరిగా, మౌలానా అర్షద్ మదానీ బంగ్లాదేశ్ పర్యటనలో హెలికాప్టర్‌ ప్రయాణ వీడియోను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మౌలానా సజ్జాద్ నోమాని అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll