ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ తన 18 నెలల పిల్లవాడిని కొట్టి హింసించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పిల్లవాడిని అలా హింసించినందుకు ఆ మహిళకి ప్రజలు దేహశుద్ది చేసారని చెప్తూ ఒక మహిళని కొందరు వ్యక్తులు కర్రలతో కొడుతున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల తన 18 నెలల పిల్లవాడిని కొట్టి హింసించిన మహిళకి ప్రజలు దేహశుద్ది చేసిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో తమ మామ కుమారులతో ఫోన్‌లో చాట్ చేస్తున్నారనే కారణానికి మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెలపై వారి బంధువులు కర్రలతో దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటన జూలై 2021లో చోటు చేసుకుంది. ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ తన 18 నెలల పిల్లవాడిని కొట్టి హింసించిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వీడియోలో యువతిని కొడుతున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగింది. ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోని రిపోర్ట్ చేసిన అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ పత్రికా కథనాల ప్రకారం ఈ వీడియోలో కనిపిస్తున్నది జూలై 2021లో తమ మామ కుమారులతో ఫోన్‌లో చాట్ చేస్తున్నారనే కారణంతో మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెలపై వారి బంధువులు కర్రలతో దాడి చేసిన విజువల్స్.
ఈ ఘటనకి సంబంధించి మహిళలపై దాడి చేసిన ఏడుగురిపై తండా పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేసినట్టు పోలీసులు మీడియాకి తెలిపారు. ఈ ఘటనకి సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ తన 18 నెలల పిల్లవాడిని కొట్టి హింసించిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదు.
చివరగా, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మహిళలపై వారి కుటుంబ సభ్యులు దాడి చేసిన వీడియోని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ తన 18 నెలల పిల్లవాడిని కొట్టి హింసించిన ఘటనకి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.