బెంగాల్‌లో దుర్గామాత మండపాల విధ్వంసం అంటూ కొందరు వ్యక్తులు మండపాలను ద్వంసం చేస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్‌లో దుర్గామాత మండపాలను విధ్వంసం చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి అయిన రాధారమ్ దాస్ ఈ వీడియోని బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, దుర్గా పూజ మండపాలపై జరిగిన దాడికి సంబంధించింది అంటూ ట్వీట్ చేసాడు. భారతీయ వార్తా సంస్థలు కూడా బంగ్లాదేశ్ దాడులకు సంబంధించి ఇలాంటివే వీడియోలను రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌పై చెలరేగిన వివాదం నేపథ్యంలో హిందూ ఆలయాలు, దుర్గా పూజ మండపాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో చాలా వరకు ఆలయాలు, మండపాలు ధ్వంసం అయ్యాయి. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిందే.
ఈ వీడియోకి సంబంధించి సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, పశ్చిమ బెంగాల్ ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ మరియు అధికార ప్రతినిధి అయిన రాధారమ్ దాస్ ఇదే వీడియోని షేర్ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. బంగ్లాదేశ్‌లోని నౌఖలిలో ఇస్కాన్ ఆలయంపై సుమారు 500 మంది ముస్లింల గుంపు దాడి చేసి, ఆలయం ముందున్న దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేసారని చెప్తూ రాధారమ్ దాస్ 15 అక్టోబర్ 2021 ఈ వీడియోని షేర్ చేసారు.
నౌఖలి దాడికి సంబంధించిన వీడియో అంటూ ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఇదే వీడియోని షేర్ చేయగా, బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ అనే సంస్థ ఈ ట్వీట్‌ని 15 అక్టోబర్ 2021న కోట్ ట్వీట్ చేసింది. పలు బంగ్లాదేశ్ సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఈ వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన దాడిదంటూ షేర్ చేసాయి.
పైన తెలిపిన ట్వీట్స్ ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, బంగ్లాదేశ్‌లోని నౌఖలిలో దుర్గా మండపాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసినట్టు రిపోర్ట్ చేసిన వార్తా కథనం మాకు కనిపించింది. హిందూ ఆలయాలపై ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు కూడా మాకు కనిపించాయి. బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, దుర్గా మండపాలపై కొందరు వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేసారంటూ టైమ్స్ నౌ ప్రచురించిన కథనంలో మండపాలను ధ్వంసం చేస్తున్న విజువల్స్ చూడొచ్చు. బంగ్లాదేశ్ ఘటనలకు సంబంధించిన మరికొన్ని న్యూస్ రిపోర్ట్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటనదని, ఈ వీడియోకి పశ్చిమ బెంగాల్‌కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.
చివరగా, బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలు, దుర్గా మాత మండపాల ధ్వంసానికి సంబంధించిన వీడియోని బెంగాల్‌లో జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు.