వర్షంలో బైక్ పై వెళ్తున్న వారిపై ఒక పెద్ద హోర్డింగు పడ్డ వీడియో ని చూపిస్తూ ఈ ఘటన చెన్నైలోని మరీనా బీచ్ దగ్గర జరిగిందని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: చెన్నైలోని మరీనా బీచ్ దగ్గర తుఫాను కారణంగా వీస్తున్న గాలులకి ఒక పెద్ద హార్డింగ్ బైక్ పై వెళ్తున్న వారిపై పడింది.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో మూడు నెలల క్రితం జరిగింది. దీనికి సంబంధించి చాలా వార్తా కథనాలు మరియు న్యూస్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఘటనకి చెన్నైకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
‘billboard falling on commuters’ అనే కీవర్డ్ తో యూట్యూబ్ లో సెర్చ్ చేయగా ఈ ఘటనను రిపోర్ట్ చేసిన మూడు నెలల క్రితం న్యూస్ వీడియోలు దొరికాయి. ఈ న్యూస్ వీడియోల ప్రకారం బైక్ పై ప్రయాణిస్తున్న వారిపై హార్డింగ్ పడ్డ ఈ ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో ఆగస్ట్ నెలలో జరిగింది. ఇదే విషయం చేప్తున్న మరొక న్యూస్ వీడియో ఇక్కడ చూడొచ్చు.
ఈ న్యూస్ వీడియోల ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనాలు కనిపించాయి. ఈ కథనాలు కూడా ఈ ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో జరిగినట్టు ప్రచురించాయి. ఇదే విషయం చేప్తున్న మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటిని బట్టి ఈ ఘటన చెన్నైలో జరగలేదని కచ్చితంగా చెప్పొచ్చు.
ఇంతకుముందు ఇదే వీడియో వేరే క్లెయిమ్ తో వైరల్ అయినప్పుడు FACTLY దినిని డీబంక్ చేస్తూ ఆగష్టు లో రాసిన ఫాక్ట్-చెక్ స్టొరీని ఇక్కడ చదవొచ్చు.
నివర్ తుఫాను కారణంగా చెన్నైలో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, బైక్ పైన ప్రయాణిస్తున్న వారిపై హార్డింగ్ పడ్డ ఈ ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో జరిగింది, చెన్నైలో కాదు.