విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ వీడియో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఫ్లై ఓవర్ పై ఉన్న ఒక వాహనం నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగిన దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై ఇటివల జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఫైర్ ఆక్సిడెంట్ పూణే నగరంలోని వార్జే బ్రిడ్జి పై చోటుచేసుకుంది, విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై కాదు. ఇదే వీడియోని హైదరాబాద్ కి ముడిపెడుతూ షేర్ చేసినప్పుడు, ఈ ఘటనకి సంబంధించిన వివరాలు తెలుపుతూ సైబారాబాద్ పోలీస్ వారు ట్వీట్ కూడా పెట్టారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని కొంత మంది యూసర్లు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలని డిసెంబర్ 2020 మొదటి వారంలో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూణే-బెంగళూరు రహదారి పై ఉన్న వార్జే బ్రిడ్జి పై ఈ ప్రమాదం చోటుచేసుకునట్టు అందులో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన వివరాలు తెలుపుతూ ‘Dainik Bhasker’ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన 05 డిసెంబర్ 2020 నాడు చోటుచేసుకునట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. పూణే-బెంగళూరు రహదారి పై ఉన్న వార్జే బ్రిడ్జి మీదుగా వెళ్తున్న ఒక ట్రక్కు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది.
ఇదివరకు, ఇదే వీడియోని హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై జరిగిన ఆక్సిడెంట్ గా షేర్ చేసినప్పుడు, సైబారాబాద్ పోలీసులు ఈ ఫైర్ ఆక్సిడెంట్ పై స్పష్టతనిస్తూ ట్వీట్ పెట్టారు. అంతేకాదు, FACTLY దీనికి సంబంధించి అప్పుడు ఫాక్ట్-చెక్ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఫైర్ ఆక్సిడెంట్ విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై జరగలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, పూణే వార్జే బ్రిడ్జి పై జరిగిన పాత ఫైర్ ఆక్సిడెంట్ వీడియోని విజయవాడ దుర్గమ్మ గుడి వద్ద ఉన్న ఫ్లై ఓవర్ పై జరిగిన ఆక్సిడెంట్ గా చిత్రికరిస్తున్నారు.